Wednesday, August 27, 2014

'యోని'జులూ...అ'యోని'జులూ

ద్రౌపది తండ్రి ద్రుపదుడు. అతని తండ్రి పేరు పృషతుడు. పాంచాలరాజు అయిన పృషతుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అప్సరస అయిన మేనక పువ్వులు సేకరిస్తూ కనిపించింది. ఆమెను చూడగానే పృషతునికి స్కలనం జరిగింది. దానిని అతను తన పాదంతో కప్పాడు. అప్పుడు మరుత్తుల అంశతో దానినుంచి ద్రుపదుడు పుట్టాడు. పాదం నుంచి వచ్చాడు కనుక అతనికా పేరు వచ్చింది.

పృషతునికి భరద్వాజుడు మిత్రుడు. పృషతుడు తన కొడుకు ద్రుపదుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి తను పాంచాలరాజ్యాన్ని పాలించడానికి వెళ్లిపోయాడు. అంతకుముందు భరద్వాజునికీ పృషతునికి ఎదురైన అనుభవమే  ఎదురైంది. అతను గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఓ రోజున గంగలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఘృతాచి అనే అప్సరస జలక్రీడలాడుతూ కనిపించింది. ఆమెను చూడగానే భరద్వాజుడికి కోరిక కలిగింది. స్కలనం జరిగింది. దానిని అతను ఒక ద్రోణి(దొప్ప)లోకి తీసుకున్నాడు. దానినుంచి శుక్రుని అంశతో ఒక శిశువు పుట్టాడు. ద్రోణినుంచి పుట్టాడు కనుక అతనికి ద్రోణుడనే పేరు వచ్చింది.

Wednesday, August 20, 2014

అమెరికాలో వేద కాలపు ఒక ఆనవాయితీ

 బార్బెక్యూ వేదకాలం నుంచీ కొనసాగుతున్న సాముదాయిక విందు కార్యక్రమం. దానిని మనవాళ్లు శూలమాంసం’ అన్నారు.

అమెరికాలో ఇళ్లముందు బార్బెక్యూ పొయ్యిలు ఇప్పటికీ కనిపిస్తాయి. దగ్గరలోని అడవుల్లోకో, తోటల్లోకో వెళ్ళి బార్బెక్యూ చేసుకోవడం కనిపిస్తుంది.

మాంసభోజన ప్రియులనే కాక, మద్యప్రియులను కూడా అలరించే సందర్భం బార్బెక్యూ. యవ్వనారంభంలో ఉన్న యువతీ, యువకుల్లో ప్రేమలూ, మోహాలూ పురివిప్పి నర్తించే సందర్భం కూడా.  న్యూ వరల్డ్ గా చెప్పుకునే అమెరికాలో అతి పురాతనమైన వేదకాలపు ఒక ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతున్న ఆ దృశ్యం ఒక్కసారిగా మనల్ని వేల సంవత్సరాల గతంలోకి తీసుకువెళ్లి ఆశ్చర్యచకితం చేస్తుంది. యూరోపియన్ల ద్వారానే ఈ ఆనవాయితీ అమెరికాకు బదిలీ అయిన సంగతి తెలుస్తూనే ఉంది. అదలా ఉంచితే, యూరోపియన్లకు వేదకాలపు సంస్కృతితో సంబంధముందనని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. 

(పూర్తివ్యాసం http://magazine.saarangabooks.com/2014/08/20/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%82-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D/ లో చదవండి)


Wednesday, August 13, 2014

కన్యా సంపర్కం-గణసమాజం

కన్య అంటే అవివాహిత మాత్రమే తప్ప పురుష సంపర్కం లేనిది కాదు అన్న వాక్యం; కన్య గురించిన నేటి మన ఊహను తలకిందులు చేసి షాక్ ఇస్తున్న మాట నిజమే.  అప్పుడు షాక్ అబ్జార్వర్ గా పనిచేసేది తటస్థ దృష్టి మాత్రమే.

ఋతుమతి అయితే పురుష సంపర్క దోషం పోతుందన్న సూత్రం, ఆమె కన్యగా సంతానం కన్న అనంతర పరిస్థితికీ వర్తిస్తుంది. అంటే అప్పుడు కూడా ఆమె కన్యగానే ఉంటుంది. ఉన్నప్పుడు పరాశరుడు సత్యవతికి, దుర్వాసుడు(లేదా సూర్యుడు) కుంతికి ప్రత్యేకంగా కన్యాత్వ వరాన్ని ఇవ్వనవసరంలేదు. 


ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కన్యకు పురుష సంపర్కం గణసమాజానికి చెందిన నీతి. గణసమాజంలో దానిని దోషంగా కాదు సరికదా, గుణంగా కూడా భావించినట్టు కనిపిస్తుంది. గణసమాజం అంతరించినా ఆ సమాజం తాలూకు లక్షణాలు అనంతర కాలంలోకి ప్రవహిస్తూనే వచ్చాయి. అలా మన పురాణ ఇతిహాసాలకూ ఎక్కాయి. ఇప్పటికీ మన అనేక ఆచారాలలో, భాషలో, నుడికారంలో గణ సమాజ లక్షణాలు కనిపిస్తాయి. 

Friday, August 8, 2014

'కన్య' అంటే...?

స్త్రీ-పురుషుల మధ్య సయోధ్య తప్పనిసరి. లేకపోతే సృష్టి జరగదు. అయితే, లింగభేదం వల్ల వారి మధ్య సంఘర్షణా ఒక్కొక్కసారి అనివార్యమవుతూ ఉంటుంది. స్త్రీ పురుషుణ్ణి తన చెప్పుచేతల్లో ఉంచుకోడానికి ప్రయత్నిస్తుంది. పురుషుడు ప్రతిఘటిస్తాడు. అలాగే స్త్రీని కట్టడి చేయాలని పురుషుడు ప్రయత్నిస్తాడు. స్త్రీ ప్రతిఘటిస్తుంది. ఇద్దరి మధ్యా ఒక వ్యూహాత్మక, నిశ్శబ్ద పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో వారి మధ్య సర్దుబాటు క్షణాలూ ఉంటూ ఉంటాయి. ఇలా చూసినప్పుడు స్త్రీ-పురుషుల చరిత్ర సమస్తం సయోధ్య-సంఘర్షణల చరిత్రే.

నాకీ సందర్భంలో ప్రసిద్ధ కథకుడు ఓ. హెన్రీ రాసిన ఒక కథ గుర్తొస్తోంది. పేరు గుర్తులేదు కానీ విషయం మాత్రం గుర్తుంది. కాకపోతే వివరాలలో ఒకింత తేడా వస్తే రావచ్చు:


కాయకష్టం చేసుకుని జీవించే ఒక పల్లెటూరి జంట. వారు ఎప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. భర్త ఓ ఉద్రేక క్షణంలో నీకు విడాకులు ఇచ్చేస్తానని భార్యతో అంటాడు. మరీ మంచిది, నేనూ అదే కోరుకుంటున్నానని భార్య అంటుంది. అయితే, విడాకులు మంజూరు చేసే జడ్జి దగ్గరకు వెడదాం పద అంటాడు. ఇద్దరూ బండి కట్టుకుని పట్నానికి బయలుదేరతారు. జడ్జి ఇంటికి వెడతారు. భార్య వల్ల తను ఎలా కష్టాలు పడుతున్నాడో భర్త చెబుతాడు. భర్త తనను ఎలా కాల్చుకుతింటున్నాడో భార్య చెబుతుంది. మాకు విడాకులు ఇప్పించండని ఇద్దరూ అడుగుతారు.

Sunday, August 3, 2014

పిల్లలపై పెద్దవాళ్ళ రుద్దుడు

పిల్లల పరిస్థితి చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది.

ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలపై తమ కోరికలు, సరదాలు రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందనుకుంటారు.

స్కూల్లో టీచర్లు తమ ఇష్టాలు, తమ నమ్మకాలు పిల్లలపై రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందనుకుంటారు.

పాఠ్యపుస్తకాలు రాసేవాళ్ళు తాము విశ్వసించే విషయాలనే పాఠాలుగా తయారు చేసి పిల్లలపై రుద్దుతూ ఉంటారు. అలా రుద్దే హక్కు తమకు ఉందను కుంటారు.

ప్రభుత్వాలు, న్యాయస్థానాలు...ఒకటేమిటి సమాజానికి చెందిన అన్ని అంగాలు పిల్లలను ఫలానా విధంగా తీర్చి దిద్దే బాధ్యత తమకు ఉందనుకుంటాయి. ఏ రంగానికి చెందినవారైనా సరే, పిల్లల పాలిట బెత్తం ఝళిపించే బడి పంతుళ్లే.

పెద్దవాళ్ళమనుకునే ప్రతివారూ పిల్లల్ని సొంత ప్రయోగశాలగా చూసే వాళ్ళే.

ఇంతకన్నా మరో ఛాన్స్ రాదన్నట్టు పెద్దవాళ్ళు తమకు తెలిసినవీ, తమకు ఇష్టమైనవీ, తాము నమ్మేవీ అన్నీ  పిల్లల నోరు బలవంతంగా తెరిపించి ఏకధారగా పోసేయాలనుకుంటారు. వారికి అవి జీర్ణమవుతాయా కావా అని కూడా ఆలోచించరు. మొత్తానికి పెద్దవాళ్ళు అందరూ కలసి స్కూలును ఒక concentrated camp గా మార్చివేస్తారు.

అరె..పిల్లలు స్కూల్లో ఎంతసేపు గడుపుతారో అంతకన్నా ఎక్కువసేపు తల్లిదండ్రులతోనూ, బయటి ప్రపంచంతోనూ గడుపుతారన్న స్పృహ వీళ్లలో ఎందుకు ఉండదు? పిల్లలకు మనం నేర్పే దానికంటే  వాళ్ళు సొంతంగా నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుందనే ఆలోచన వీళ్ళకు ఎందుకుండదు? ఇంకో సంగతి గమనించారోలేదో? పెద్దవాళ్ళ బుర్ర కన్నా పిల్లల బుర్ర షార్ప్ గా ఉంటుంది. గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది. వారు దేనినైనా వేగంగా నేర్చుకోగలుగుతారు. తల్లిదండ్రుల్లారా, టీచర్లలారా, పాఠ్యపుస్తకాలు రాసేవాళ్ళు లారా, ఇంకా వివిధ రంగాలకు చెందినవాళ్ళ లారా...మీ పిల్లలతోనే మిమ్మల్ని పోల్చి చూసుకోండి, మీకు తెలియని విషయాలు అనేకం వాళ్ళకు తెలుసున్న సంగతి మీకే అర్థమవుతుంది.

తనకే ఆ అధికారం ఉంటే పిల్లలకు పాఠశాల నుంచీ భగవద్గీత బోధించే ఏర్పాటు చేస్తానని ఒక జడ్జీగారు సెలవిచ్చినట్టు తాజా వార్త. పిల్లలకు భగవద్గీత బోధించాలన్న సంగతి తమరు స్కూల్లో భగవద్గీత చదువుకున్న అనుభవంతోనే అంటున్నారా స్వామీ? బహుశా మీరు పెద్దయ్యాక భగవద్గీత మిమ్మల్ని ఆకర్షించి ఉంటుంది. పెద్దయ్యాక స్వచ్ఛందంగా భగవద్గీతవైపు ఆకర్షితులయ్యే అవకాశం పిల్లలకు కూడా ఇచ్చే బదులు బలవంతంగా బోధించడం ఎందుకు మహాశయా?

మా అబ్బాయికి చిన్నప్పుడు స్కూల్లో భగవద్గీత శ్లోకాలు బట్టీ పట్టించేవాళ్ళు. ఇంట్లో వాటిని వల్లెవేస్తూ ఉండేవాడు.ఇప్పుడు వాణ్ని అడిగితే ఒక్క శ్లోకం కూడా చెప్పలేడు.  పిల్లలకు భగవద్గీత అనే గ్రంథం ఉందన్న సమాచారం ఇస్తే చాలు. లాంగ్వేజ్ స్కిల్స్ కోసం కొన్ని శ్లోకాలను బట్టీ పట్టించడంలో తప్పులేదు. కానీ బోధించడమా?! ఏం బోధిస్తారు? వారికి అది ఏమాత్రం అర్థమవుతుంది? ఏమాత్రం తమకు దానిని అన్వయించుకోగలుగుతారు?

స్కూల్లో బలవంతంగా మీరు ఎన్ని నేర్పినాసరే, పిల్లలు పెద్దవుతున్నకొద్దీ స్వచ్ఛందంగా వాటిని మించి ఎన్నో నేర్చుకుంటారు. బలవంతంగా నేర్పినదానికన్నా స్వచ్ఛందంగా నేర్చుకున్నదే ఎక్కువ నాటుకుంటుంది. స్కిల్స్ అనే మాటను పనులకు సంబంధించే ఎక్కువగా వాడుతూ ఉంటాం. లెక్కలు నేర్చుకోవడం, భాష నేర్చుకోవడం వగైరాలు కూడా స్కిల్స్ కిందికే వస్తాయి. ఒక వయసు వరకు పిల్లలకు స్కిల్స్ అందించడమే ప్రధానం కావాలి. తక్కువ నేర్పి ఎక్కువ నేర్చుకునే అవకాశం పిల్లలకు వదిలేయడమే నిజమైన చదువు.

పిల్లల్ని పెద్దవాళ్ళు సొంత ప్రయోగశాలగా వాడుకోవడం అనే దౌర్జన్యాన్ని గుర్తించినప్పుడు, పిల్లల చదువు ఎలా ఉండాలన్నది ఫ్రెష్ గా ఆలోచించడానికి వీలవుతుంది.