Friday, July 5, 2013

రుద్రాక్షలు ఇంత పెద్ద వ్యాపారమా?!

రుద్రాక్షల మహిమ గురించి టీవీ చానెళ్లలో చాలాకాలంగా వాణిజ్య ప్రకటనలు వస్తున్నాయి కానీ, ఆ వ్యాపారం ఇంతగా ఊహించని రేంజికి చేరుకుంటుందని అనుకోలేదు. ఈ మధ్య హైదరాబాద్ లో ఒకచోట రుద్రాక్షల వ్యాపారానికి సంబంధించిన ఒక పెద్ద హోర్డింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ వ్యాపారం కార్పొరేట్ వ్యాపార స్థాయిని అందుకున్నట్టుందని దానిని చూడగానే అనిపించింది.

రుద్రాక్షలకు మహిమ ఉంటుందన్న విశ్వాసం అనాదిగా ఉన్నదే. రుద్రాక్షమాలలు చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. వాటిని ధరించే వాళ్ళూ చాలామందే కనిపిస్తారు. ఏకముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష వగైరా పేర్లు టీవీ చానెళ్లలో ప్రచారానికి చాలా ముందునుంచే; టీవీ కూడా లేని రోజులనుంచే పూజాపునస్కారాలు చేసే  కుటుంబాలలో వినబడుతూ ఉండేవి. హిమాలయప్రాంతాలవైపు వెళ్లినప్పుడు వాటిని తెచ్చుకోవడమూ ఉండేది. కానీ రుద్రాక్ష ధారణ జరుగుతున్న ఇన్నేళ్లలోనూ అది ఒక భారీ వ్యాపారంగా ఎప్పుడూ మారలేదు. ఇప్పుడే మారడం చూస్తున్నాం.

భారీవ్యాపారం అన్నాక అన్ని వ్యాపారాలకూ వర్తించే ప్రమాణాలు, సూత్రాలు, పారదర్శకత మొదలైనవి ఈ వ్యాపారానికి కూడా వర్తించవలసిందే కదా? వర్తిస్తున్నాయా? వినియోగదారులు మోసపోకుండా చూసే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మేము మోసపోయామని వారు ఫిర్యాదు చేస్తే పరిహారం ఇప్పించడం వగైరా చర్యలు తీసుకునే వ్యవస్థ ఏమైనా ఉందా?

"రుద్రాక్షలకు మహిమ ఉంటుందన్న్దది  కేవలం విశ్వాసం మాత్రమే, ఆ మహిమ కొందరికి అనుభవంలోకి రావచ్చు; కొందరికి రాకపోవచ్చు, దానికి హామీ ఎలా ఇస్తాం?  రుద్రాక్ష వినియోగదారులను ఇతర వినియోగదారులతో ఎలా జమ కడతాం? కనుక వారికి consumer protection ఎలా ఇస్తాం?" అని రుద్రాక్ష వ్యాపారులు వాదించవచ్చు. లేదా ఇతరులకే అలాంటి సందేహాలు కలగచ్చు.

అయితే ఇక్కడ ఒక తేడా గమనించాలి. రుద్రాక్షలు ఇలా భారీ వ్యాపారంగా మారని రోజుల్లో వాటి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు తమంతట తాము కొనుక్కుని లేదా సంపాదించుకుని తెచ్చుకునే వాళ్ళు. టీవీ చానెళ్లు, లేదా భారీ హోర్డింగ్ ల ప్రచారానికి ప్రభావితులై కాదు. వాటిని అమ్మే వ్యక్తులో లేదా చిన్నపాటి దుకాణాలవారో వాటి మహిమ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు కాదు. కనుక అటువంటి సందర్భాలలో కొనుక్కున్న వారిదే పూర్తి బాధ్యత.

ఇంకొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తిరుపతి వేంకటేశ్వరస్వామి మీద విశ్వాసం ఉన్న భక్తులు ఆయనను దర్శిస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో స్వచ్ఛందంగా తిరుమలకు వెడతారు. అందుకు వెచ్చించే శ్రమకు, ఖర్చులకు, అక్కడ హుండీలో వేసే డబ్బులకు పూర్తి బాధ్యత వాళ్ళదే.

అలా కాకుండా తిరుమలేశునికి గొప్ప మహిమలు ఉన్నాయనీ, ఆయనను  దర్శిస్తే మీకు ఫలానా ఫలానా మంచి జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వారే భారీ ఎత్తున ప్రకటనలను ప్రసారం చేస్తే, హోర్డింగ్ లను ఏర్పాటు చేస్తే, వాటిని చూసి భక్తులు ఆకర్షితులై ఇప్పటి కంటే పెద్ద సంఖ్యలో తిరుమలకు వెడితే అప్పుడు బాధ్యత టీ.టీ.డీ వారిదే అవుతుంది. వారు అలా చేయడం లేదు కనుక తమ తిరుమల యాత్రకు భక్తులే బాధ్యత వహించాలి. తిరుమలకే కాదు, ఏ గుడి కైనా, జ్యోతిషం వగైరా ఏ విశ్వాసాలకైనా ఇదే వర్తిస్తుంది.

ఇందుకు భిన్నంగా రుద్రాక్ష వ్యాపారులు రుద్రాక్షల మహిమ గురించి భారీ ఎత్తున ప్రచారం చేస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు కనుక వారికి జవాబుదారీ ఉండనవసరం లేదా? ఆ వ్యాపారానికి ఇతర వ్యాపారాలకు వర్తించే సూత్రాలు, ప్రమాణాలూ వర్తించనక్కరలేదా?

ఇవే ప్రశ్నలు జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం వగైరాలకూ వర్తిస్తాయి. అవునా? కాదా?


11 comments:

  1. కచ్చితంగా భాస్కరం గారు. మంచి చర్చను లేవనెత్తారు. సినిమా తారల్ని కూడా ఎరవేసి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేస్తున్న సినిమా తారల్ని కూడా బాధ్యుల్ని చేయాలి.

    జనం ఇక్కడో విషయం మర్చిపోతున్నారు. రుద్రాక్షల వల్ల నిజంగా మేలు జరిగితే అవి అమ్ముతారా. తమ దగ్గరే ఉంచుకుంటారు కానీ.

    అంతెందుకు. ఆ రుద్రాక్షల గురించి ప్రచారం చేసే టీవీలకు రేటింగ్ రాక కొట్టుకంటున్నారు కదా. కనీసం ఆ రుద్రాక్షల్ని ధరించి టీవీ రేటింగ్ పెంచుకోవచ్చు కదా...? అన్నట్లు ఇందులో టీవీ సంస్థలు కూడా ఐనవీ కానివీ ప్రచారం చేయకుండా నియంత్రించే వ్యవస్థ ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చందు తులసి గారూ.

      Delete
  2. సర్వ ధర్మాన్ పరిత్యజ్య మమ ఏక శరణం వ్రజ .... అహం త్వం సర్వ పాపెభ్యో మోక్షయిస్యామి మా సుచా !
    అని కృష్ణ పరమాత్ములు గీతలో చెప్పెరండీ ! వారికి జవాబుదారీ ఉందా లేదా వివరించ గలరు !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జిలేబీ గారు. మంచి ప్రశ్న వేశారు. కృష్ణుడు మోక్షాన్ని మార్కెట్ లో పెట్టి వ్యాపారం చేస్తే తప్పకుండా ఆయనకూ జవాబుదారీ ఉంటుంది. ఏ కాలంలోనైనా వ్యాపారికి తను అమ్మే సరుకుకు జవాబుదారీ ఉంటుంది, ఉండవలసిందే. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక గురువు ఉన్నారు. నేను ఉచితంగా చదువు చెబుతాను, మిమ్మల్ని విద్యావంతుల్ని చేస్తాను అని చెబితే ఆయన మీద గురి లేదా విశ్వాసం ఉంటే వెడతారు, లేకపోతే మానేస్తారు. అదే గురువు డబ్బు తీసుకుని చదువు చెబుతానన్నాడనుకోండి, అప్పుడు తను చెప్పే చదువుకు ఆయనకు జవాబుదారీ ఉంటుంది. మీరు కూడా జవాబుదారీని డిమాండ్ చేస్తారు. చేయరా చెప్పండి?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. భాస్కరంగారూ,
      మీతో యేకీభవిస్తున్నాను.
      భారతదేశపు సాంప్రదాయిక విద్యాబోధనలో గురువులు శిష్యులకు ఫీజులు తీసుకుని చదువు చెప్పటం లేదు. శిష్యుల యోగ్యతకు తగిన చదువు గురువులు చెప్పేవారు.

      Delete
    4. ధన్యవాదాలు శ్యామలరావు గారూ. అయితే భారతదేశపు సాంప్రదాయిక విద్యాబోధనలో ఫీజు లేకపోయినా దక్షిణ రూపంలో గురువుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం ఉంటుంది. దక్షిణకు, ఫీజుకు తేడా ఉంది. దక్షిణ స్వచ్ఛందంగా బహుశా సంతోషంగా ఇచ్చేది. ఫీజు నిర్బంధంగా ఇచ్చేది. అప్పుడు ఫీజుకు తగిన చదువును డిమాండ్ చేయవలసివస్తుంది. వ్యాపార సంబంధంలో సరకు నాణ్యతను డిమాండ్ చేయడం సహజంగానే తలెత్తుతుంది. ఇదే రుద్రాక్షల వ్యాపారానికీ వర్తిస్తుంది.

      Delete
  3. భాస్కరం గారూ ఇదివరలో శ్రీచక్రం గురించి ఇటువంటి ప్రకటనలే వచ్చాయి. గొప్ప వ్యాపారం కూడా జరిగింది. అది కూడా ఇటువంటి నమ్మకాల మీదనే నడిచింది. ఇటీవల చార్ధాం యాత్ర విషయంలో ఇలాగే సరస్వతీ నది పుస్కరాలు పేరు చెప్పి ఎంతోమంది జనాన్ని వరదల్లో ముంచేసిన కథ మనకు తెలిసిందే. అసలు సరస్వతీ నది ఎక్కడ వుంది . దానికి పుస్కరాలేమిటి అని ఎవరైనా ఆలోచించారా ? ఇంతెందుకు మన గాయత్రీ మంత్రం, దానిపై నమ్మకం ఆధారంగా ఎంత వ్యాపారం జరుగుతోంది.... ఎప్పుడైనా ఆలోచించారా? ఇదీ నేటి ప్రలోభాల చరిత్ర ... దండుకున్నవాడికి దండుకున్నంత....
    వుంటాను.... మళ్లీ కలుద్దాం ....
    మీ
    చింతలపూడి వెంకటేశ్వర్లు .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చింతలపూడి వెంకటేశ్వర్లుగారూ. వ్యాపారం జరగడం ఒకటి, దానిని నియంత్రించే వ్యవస్థ లేకపోవడం ఒకటి. అదే అసలు సమస్య.

      Delete
  4. ఒక్క రుద్రాక్షలే కాదు, కొనేవాళ్ళుంటే ఏదైనా అమ్మేస్తారు.
    మళ్ళీ గంటలకొద్ది టివీల్లో ప్రకటనలు.
    MRTP Act వీళ్ళకి వర్తించదా?

    ReplyDelete
  5. అవును బోనగిరి గారు, ధన్యవాదాలు.

    ReplyDelete