Wednesday, July 31, 2013

ఎవరు ఈ 'నరుడు'?

నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు?
                                                          -శ్రీశ్రీ
                                (మహాప్రస్థానం, దేశచరిత్రలు)
ఇవి ప్రసిద్ధ పంక్తులే కానీ, ఇందులో చెప్పిన సామాన్యుడు ఎప్పుడు, ఎందుకు, ఎలా అవతరించాడో ఎప్పుడైనా గమనించారా?

మనిషికి నరుడు అనే పర్యాయపదం ఉంది. పురాణ, ఇతిహాసాలు దేవ, దానవ, సిద్ధ, సాధ్య, యక్ష, రాక్షస, వానరాల మధ్య నరుని ఇరికించి చెప్పాయి. నేటి అవగాహనతో దేవ దానవాదులను కూడా నరులుగానే గుర్తిస్తే, లేదా ఆ మాటలు నరుని గుణ, స్వభావాలను; లేదా తెగ నామాలను తెలిపేవి అనుకుంటే ఆ జాబితాలో చెప్పిన నరుడు ఎవరనే ప్రశ్న వస్తుంది. ఇంకో విచిత్రం చూడండి: మహాభారతం అర్జునుని నరునిగా పేర్కొంటూనే, అతనిని నరుడనే ముని అవతారంగా చెప్పి మహాత్ముణ్ణి చేసింది. నరుని అంటే మామూలు మనిషిని గుర్తించడంలో మహాభారతానికి ఏదో ఇబ్బంది ఉంది. మహాభారతానికే కాదు, ప్రపంచ పురాణ కథలన్నిటికీ ఆ ఇబ్బంది ఉంది.

కీచకుడు తన వెంటపడి వేధిస్తున్నప్పుడు ద్రౌపది ఏకాంతంగా భీముని కలిసి తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆవేశం పట్టలేక, ఆ జూదరి వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నామని ధర్మరాజును తూలనాడుతుంది. అప్పుడు భీముడు ఆమెను మందలించగా తప్పు దిద్దుకుంటూ ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తిస్తుంది. ఆ సందర్భంలో “...కేవల మర్త్యుడే ధర్మసుతుడు?”  అంటుంది. ధర్మరాజు మామూలు మనిషి కాదు, మహాత్ముడని చెప్పడం అందులో ఉద్దేశం. ఇలా మహాత్ముడు-మర్త్యుడు అనే విభజన మహాభారతంలో ఇంకా చాలా చోట్ల వస్తుంది.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)

Tuesday, July 30, 2013

తెలంగాణ, సీమాంధ్రులకు శుభాభినందనలు

ఎట్టకేలకు 'ప్రకటన' జరిగిపోయింది!

దశాబ్దాలపాటు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటున్న తెలంగాణ సోదరులకు శుభాభినందనలు!

ఇంతకాలం తమకు ఒక రాజధాని స్థాయి నగరం లేని లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రసీమ ప్రాంతీయులు ఇక ఆ లోటును తీర్చుకోబోతున్నారు కనుక శుభాకాంక్షలు!

గతజల సేతుబంధనం వల్ల ఉపయోగం లేదు. జరిగింది మంచికా, చెడ్డకా అన్న చర్చను పక్కన పెడదాం. మంచినే చూస్తూ ముందుకు వెడదాం.

తెలుగువారి చరిత్రలో ఆవిష్కృతమవుతున్న ఈ కొత్తపుటను నైరాశ్యపు చీకట్లతో కాకుండా, ఆశాభావపు అక్షరకాంతులతో అలంకరిద్దాం. 

Monday, July 29, 2013

'ఆంధ్రప్రదేశ్' ఇక గతం...భవిష్యత్తు ఒక్కటే మనకు మిగిలింది!

తెలుగువారి చరిత్ర మరో కీలకమైన మలుపు తిరుగుతోంది. తెలంగాణ ఖాయమని ఇప్పుడు మరింత స్పష్టంగా తేలిపోయింది. ఇది కన్నీరు-బహుశా పన్నీరూ కలగలసిన ఒక సందర్భం. 1947లో భారతదేశ స్వాతంత్ర్యం అనే ఒక చరిత్రాత్మక ఘటన జరిగింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అనే మరో చరిత్రాత్మక ఘటన జరిగింది. నేటి రెండుతరాల తెలుగు ప్రజలకు ఈ రెండుఘటనలను తిలకించే అవకాశం కలగలేదు. ఇప్పుడు రాష్ట్రవిభజన అనే ఘటనను తిలకించే అవకాశం వారికి కలుగుతోంది. ఇది తొలి రెండు ఘటనలవంటిది కాకపోవడం ఒక తేడా.

యథాతథస్థితి(స్టేటస్ కో)ని  చెరపడానికి మానవనైజం సాధారణంగా అంగీకరించదు. భవిష్యత్తు గురించిన భయాలు, బెంగలూ భూతద్దంలో కనిపిస్తాయి. కానీ, యథాతథస్థితిని చెరిపితేనే తమకు భవిష్యత్తు ఉంటుందని ఒక ప్రాంతం నమ్ముతోంది. ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతం ఆకాంక్షలను గుర్తించక తప్పదు. దశాబ్దాలుగా రగులుతున్న సమస్య పరిష్కారాన్ని నిరవధికంగా వాయిదా వేయలేరు. అందువల్ల అన్ని ప్రాంతాలూ నష్టపోతూనే ఉంటాయి. ఇప్పటికే గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్నీ స్తంభించి పోయాయి. దీనిని ఇంకా కొనసాగిస్తే రేపటి తరాలు క్షమించవు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్ణయం జరిగిపోతోంది. ఇక గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రెండు ప్రాంతాలవారికి  బాధాకరంగా, ఒక ప్రాంతంవారికి సంతోషదాయకంగా  తోచే ఈ  పరిణామం నుంచి వీలైనంత మంచిని పిండుకోడానికే అన్ని ప్రాంతాల వారూ ఇక ప్రయత్నించాలి.

ఆవేశాలు ఇక తగ్గించుకుని ఆలోచన పెంచుకుంటే, ప్రాంతాల మధ్య వేర్పాటు భావన పెరగడానికి కారణం ఆర్థికమూ, అందులోంచి పుట్టే  రకరకాల అసమానతలే నని గుర్తించడం కష్టం కాదు. మాండలిక భేదాలు, సంస్కృతి, సాహిత్యం వగైరాలలో తేడాల గురించిన భావనలు ఆర్థికం అనే మూల కారణాన్ని మరుగుపుచ్చే తాత్కాలిక సమర్థనలు మాత్రమే. సంస్కృతి, సాహిత్యం, భాష, మాండలిక భేదాలు  వగైరాలే  ప్రాంతాల విభజనకు, స్వతంత్ర అస్తిత్వానికి ప్రాతిపదికలైతే భారత్ ఒక దేశంగా ఉండడమే సాధ్యం కాదు. కనుక ఇకనైనా ఇటువంటి తేడాలను తీసుకురాకపోవడమే వివేకవంతం.

ఆర్థిక అభివృద్ధి ఒక్కటే వేర్పాటు వాదాలకు విరుగుడు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి ఇప్పుడిక ఎవరికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. కనుక అన్ని ప్రాంతాలూ ఇక అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాజకీయ మోసాలకూ, అవకాశవాదాలకూ, బాధ్యతారాహిత్యానికి ఇకముందు అవకాశమివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, వేర్పాటుభావనకు దారితీయించిన గతాన్ని ఇక పునరావృతం చేయించరాదనీ అందరూ నిర్ణయం తీసుకోవాలి.

రాయలసీమలోని రెండు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకో ప్రాంతం నుంచి మరి కొన్ని దశాబ్దాలపాటు నిప్పును మూటగట్టుకునే ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారో ఆశ్చర్యం. ఇది నిజం కాదని నేను అనుకుంటున్నాను. రాయలసీమ వారు తమను విభజించే ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి కారణం లేదు.

'ఆంధ్రప్రదేశ్' ఇక గతం! భవిష్యత్తు ఒక్కటే తెలుగువారికి మిగలబోతోంది. ముక్కలవుతున్న ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పటం మన గుండెల్ని ముక్కలు చేసేలా కనిపించే మాట నిజమే. కానీ తప్పదు...మనసు రాయి చేసుకోవలసిందే...

Wednesday, July 24, 2013

అగ్నిని జయించిన వాళ్ళు...

“…and so-and-so took as a wife so-and-so, and begat…and begat…and  begat…”

ఆ వృద్ధ గాథికుని కథనం వింటున్న హెలీకి బైబిల్ శైలి గుర్తొచ్చింది. కుంటా కింటే ముస్లిం మతస్థుడు. అతని నుంచి ఏడో తరానికి చెందిన హేలీ దగ్గరికి వచ్చేసరికి  ఒంటి రంగు, కారు నలుపు నుంచి గోధుమవర్ణానికి మారిపోవడమే కాదు, మతమూ మారిపోయింది. హెలీకి బైబిల్ ఒక్కటే తెలుసు. 

మహాభారతంతో అతనికి పరిచయం ఉండుంటే  గాథికుని కథనం మహాభారత శైలిలా ఉందని కూడా అనుకుని ఉండేవాడు. అంతేకాదు, మౌఖిక సంప్రదాయానికి చెందిన ప్రపంచ పురాణ కథకులందరూ తమ వీరపురుషుల గాథలనూ, వంశచరిత్రలనూ, కుల పురాణాలనూ ఈ శైలిలోనే చెప్పుకుని ఉండచ్చన్న సంగతి అతనికి స్ఫురించి ఉండేది.

గాథికుడు కింటే వంశ వివరాలు చెప్పుకుంటూ వెడుతున్నాడు. నాటి ముఖ్యమైన కొన్ని ఘటనల ద్వారా సంవత్సరాలను, తేదీలను సూచిస్తున్నాడు. ఉదాహరణకు, అప్పుడు భారీగా వరదలు వచ్చాయి”... అతను ఓ దున్నపోతును వధించాడు”...


గాథికుడు చెప్పిన కింటే వంశ వివరాలను సంగ్రహీకరిస్తే...

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Saturday, July 20, 2013

శ్రీ సాయి సచ్చరిత్ర: చాగంటివారి వ్యాఖ్యలు

నేటి ప్రవచకులు అనేకమందిలో చాగంటి కోటేశ్వరరావు గారు అనేక విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నవారు. వాటన్నింటిలోనూ ప్రప్రథమంగా చెప్పుకోవలసినదేమిటంటే, ఆయన తను ప్రవచించే అంశాన్ని అనుభవిస్తూ, అందులో తాదాత్మ్యం చెందుతూ ప్రసంగిస్తారు. భక్తితన్మయత్వాన్ని స్వయంగా అనుభవిస్తూ చెప్పడమే ఆయన ప్రసంగానికి చక్కని శ్రావ్యతనూ, మాధుర్యాన్నీ కల్పిస్తూ అసంఖ్యాక శ్రోతలను ఆయనవైపు ఆకర్షిస్తోంది. ఆయనలోని అపరిగ్రహం(తన ప్రసంగాలకు ప్రతిఫలం తీసుకోకపోవడం) అనే అరుదైన లక్షణం కూడా ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది.  ఎవరినీ నొప్పించకుండా మాట్లాడడం ఆయనలోని మరో ప్రత్యేకత. వారి గురించి నేను గత సంవత్సరం ఇండియా టుడే లో రాస్తూ నేటి కాలపు పౌరాణిక సెలెబ్రెటీగా ఆయనను పేర్కొని ఆయన ప్రత్యేకతలను కొన్నింటిని స్పృశించాను.

ఈ అవగాహన నేపథ్యంలో, శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గురించి టీవీ 9 వారు ప్రసారం చేసిన ఆయన వ్యాఖ్యలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. అయ్యో, ఇలా మాట్లాడుతున్నారేమిటని బాధకలిగింది. ఆ మాటలు ఆయన స్వభావ విరుద్ధంగా  చాలా కటువుగా ధ్వనించాయి. ఆయా పవిత్ర గ్రంథాల పారాయణం గురించి ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని ప్రకటించే సంపూర్ణ స్వేచ్ఛ కూడా వారికి ఉంది. ఆయన అభిప్రాయాలు  నిజాలే కావచ్చు. శ్రీ సాయి సచ్చరిత్ర పై, గురుచరిత్రపై గౌరవభావమే తప్ప వ్యతిరేక భావం వారికి లేకపోవచ్చు. కానీ అంతటి ప్రసంగకోవిదులైన ఆయన ఈసారి ఎందుకో  తన అభిప్రాయప్రకటనలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదనే నాకు అనిపించింది. ఆయన అభిప్రాయాలు ఏకపక్షంగా ఉన్నట్టు అనిపించడమే కాక, ఆయన నుంచి సందేహానివృత్తిని  కోరదగినవిగానూ  కనిపించాయి.

ముందుగా వారి వ్యాఖ్యలను చెప్పుకుందాము:

1. నూటికి 99 మంది కోరికలతోనే గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు. కోరికలతో గురువు వద్దకు వెళ్లకూడదు. గురువుకు అసహ్యం పుడుతుంది.

2. సచ్చరిత్ర పారాయణ చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చేస్తున్నారు?

3. వ్యాసుడు చెప్పిందే ప్రమాణం. వారి కన్నా ఎక్కువ ఎవరూ చెప్పలేరు. సాయిబాబా గారైనా వ్యాసుడు చెప్పిందే చెప్పాలి.

4. సాయిబాబా జీవితచరిత్ర పారాయణ చేయచ్చు. అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. తత్వం ఆవిష్కరణ కానిదే పారాయణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సాయిబాబా గారికి ఇష్టమైనది తత్వ బోధే. గురుచరిత్ర పారాయణం తప్పని నేను అనను. అయితే ప్రయోజనం లభిస్తుందని చెప్పడం కష్టం.

5. (సాయి సచ్చరిత్ర లోని) సుదాముని కథ తప్పు. అది తాడూబొంగరం లేని కథ. అంత అర్థరహితమైన కథ ప్రపంచంలో లేదు. కుచేలుని గురించి ఇష్టమొచ్చినట్లు రాయడం తప్పు. అది చదవడం వల్ల పాపం వస్తుంది. కుచేలుని గురించి చులకనగా రాయడం, చదవడం దారుణం. ఆ రచయిత కనిపిస్తే దీనికి ప్రమాణం ఏమిటని అడగండి.

6. అర్థం తెలిసినా తెలియకపోయినా బీజాక్షరాలు ఉన్న గ్రంథాలను పారాయణ చేస్తే ప్రయోజనం ఉంటుంది. అపారమైన శక్తి ప్రవహిస్తుంది. సుందరకాండను, సౌందర్యలహరిని పారాయణ చేస్తారు. వాటిలో బీజాక్షరాలు ఉన్నాయి. అవి బుద్ధి మీద ప్రభావం చూపిస్తాయి. వాటివల్ల సరస్వతీ కటాక్షం ఉంటుంది. అర్థం తెలియనక్కరలేదు.

పాయింట్ల వారీగా నా స్పందన ఇదీ:

1. కోరికలతో పారాయణ చేయకూడదన్న చాగంటి వారి అభిప్రాయం ఒక ఆదర్శస్థితిని చెబుతుంది. కనుక దానితో  ఎవరూ విభేదించనవసరం లేదు. అయితే నూటికి  99 మంది గురుచరిత్ర ఒక్కదానినే కోరికలతో పారాయణ చేస్తున్నారని నేను అనుకోను. సుందరకాండ, లలితాసహస్రం, విష్ణుసహస్రం వంటి పారాయణ యోగ్యమైన గ్రంధాలను కూడా చాలామంది కోరికలతోనే పారాయణ చేస్తారు. అలాంటివారు ఎందరో మనకు తెలుసు. కోరికలతో పారాయణ ప్రారంభించినా క్రమంగా అది చాగంటి వారు చెప్పిన తత్వావిష్కారానికీ, కోరికలను లేని స్థితికీ దారితీయచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే, సుందరకాండ పుస్తకంలోనే దాని పారాయణవల్ల ఎటువంటి ఐహికమైన  కోరికలు సిద్ధిస్తాయో చెబుతారు. అటువంటి ప్రచురణాలను చాలామంది చూసే ఉంటారు. చాగంటివారు ఈ అంశాన్ని స్పృశించి ఖండించినట్టు లేదు. అలాగే, కోరికలతో వచ్చేవారిని ప్రోత్సహించే గురువులు కూడా ఉన్నారు. వారి గురించి చాగంటి వారు మాట్లాడినట్టు లేదు. (వారు మాట్లాడారనీ, టీవీ 9 వారు వాటిని ఎడిట్ చేశారనీ నిరూపితమైతే ఈ నా అభిప్రాయాన్ని ఉపసంహరించుకుంటాను)

2.  సచ్చరిత్రను పారాయణ చేయమని ఎవరు చెప్పారు, ఎందుకు చేస్తున్నారని అనడంలో ఆయన స్వభావ విరుద్ధమైన కటుత్వం ధ్వనించింది.

3. వ్యాసుడు చెప్పిందే ప్రమాణమని నిష్కర్షగా చెప్పడానికి చాగంటివారికి ఉన్న  స్వేచ్ఛను ప్రశ్నించడం లేదు. అయితే, సాయిబాబా గారైనా సరే వ్యాసుడు చెప్పిందే చెప్పాలనడం సాయి భక్తులను నొప్పిస్తుంది. సాయి భక్తులకు సాయిబాబాయే సర్వోన్నతుడు. ఎవరి గురి వారిదే కనుక నిజానికి ఆధ్యాత్మిక జగత్తులో సాధారణంగా  ఇలాంటి తారతమ్యాలను తీసుకురారు. స్వయంగా చాగంటివారే హరి హరుల సందర్భంలోనూ, ఇతర సందర్భాలలోనూ  ఈ విషయాన్ని ఉద్ఘాటించారు.

4. పారాయణ చేయచ్చు గానీ ప్రయోజనం ఉండదన్న వారి నిర్ధారణ సాయి భక్తులను, గురుచరిత్ర పారాయణ చేసేవారినీ నొప్పించి నిరుత్సాహపరుస్తుంది. పూజ కానీ, పారాయణ కానీ వ్యక్తిగతం, వ్యక్తిగత విశ్వాసపూర్వకం. వాటి వల్ల ప్రయోజనం అనేది వారి వారి అనుభవానికి అందేదే తప్ప ఇతరులు చెప్పగలిగింది కాదు.

5. నేను గమనించినంతవరకు సచ్చరిత్రలోని సుదాముని కథలో తప్పు కానీ, చదివితే పాపం కలిగేటంత అనుచితి కానీ కనిపించలేదు. దగ్గర ఉన్న వారికి పెట్టకుండా ఒక్కడే తినకూడదన్న ధర్మాన్ని మాత్రమే అది చెబుతుంది. ఒక వేళ ఆ కథ  ప్రామాణికమైనది కాకపోతే ఆ మాట చెప్పవచ్చు. కానీ దానిమీద చాగంటి వారు ఆ స్థాయిలో స్పందించడం వారి ప్రసంగసరళిని ముందునుంచీ గమనించేవారిని ఆశ్చర్యచకితం చేస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. వేల సంవత్సరాలుగా అస్తిత్వం లో ఉన్న పురాణకథలు కాలగతిలో అనేక రూపాలు తీసుకున్నాయి. ఒకే కథ భిన్న ప్రాంతాలలో భిన్న రూపాలలో జనశ్రుతిలో ఉంటూ వచ్చింది. సచ్చరిత్ర రచయిత మరాఠీ భాషీయుడు కనుక తన ప్రాంతంలో వ్యాప్తిలో ఉన్న కథను తీసుకుని ఉండచ్చు. పురాణకథలకు ప్రామాణికతను నిర్ధారించడం కష్టం. బహుశ్రుతులు అయిన చాగంటివారికి ఈ విషయం తెలిసే ఉంటుందనడంలో సందేహం లేదు.

6. బీజాక్షరాలు ఉన్న గ్రంథాలను పారాయణ చేస్తే విశేషఫలితాలు ఉంటాయని ఆయన చెప్పడం వరకూ సరే. ఇతర గ్రంథాల పారాయణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదనడమే ఆలోచనీయం. ఇది కూడా వ్యక్తిగత విశ్వాసానికీ, అభిరుచికీ, ఇష్టానికీ సంబంధించినది. సాయి సచ్చరిత్ర పారాయణ వల్ల ఎవరైనా మనశ్శాంతి పొందుతుంటే అది ప్రయోజనం కాదని అనగలమా? అదీగాక ఏ గ్రంథానికి ఎటువంటి మహిమ సిద్ధిస్తుందో ఎలా చెప్పగలం?

చాగంటివారు ఆర్షసంప్రదాయబోధకులు. ఆ సంప్రదాయానుగుణంగా వారు చేసే బోధలు ఆర్షసంప్రదాయ అనుయాయులందరికీ  శిరోధార్యం కావడం సహజమే. అయితే భారతదేశంలో అర్షసంప్రదాయమే కాక ఇతర సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఆయా కులాల వారు ఆయా ప్రత్యేక దేవీ దేవతలను కొలవడం కనిపిస్తుంది. ఉదాహరణకు పెద్దమ్మ, పోలేరమ్మ, గండి పోచమ్మ, మావుళ్ళమ్మ వంటి దేవతలను పూజించే కులాలవారినే తీసుకోండి. వారు ఆ దేవతలను భక్తి, విశ్వాసాలతో కొలుచుకుంటూ; అందువల్ల తాము ప్రయోజనం పొందుతున్నామనే నమ్ముతారు. ఆ పూజా విధానాలు కూడా అర్షవిధానాలకు భిన్నంగానూ ఉంటాయి. ఆర్షసంప్రదాయ అనుయాయులు అటువంటి కొలుపులలో సాధారణంగా పాల్గొనరు. వారి పద్ధతిలో వారు పూజలు, ఉపాసనలు చేసుకుంటారు. తెలంగాణలో జరిగే బోనాలలో ఆంధ్రప్రాంతీయులు పాల్గొనడం తక్కువ. వారి పద్ధతులు వారికి ఉన్నాయి. అలాగే, ఇతర ప్రాంతీయ భేదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పాండురంగవిఠలుడు మహారాష్ట్రలో ప్రసిద్ధ దైవం, మన రాష్ట్రంలో అంతగా కాదు. అంతిమంగా చెప్పాలంటే, అంతా విశ్వాసంలోనే ఉంది. సాయి సచ్చరిత్ర పారాయణకైనా, మరో పారాయణకైనా ఇదే వర్తిసుంది. బీజాక్షరాలు ఉన్న సంస్కృత గ్రంథాల పారాయణ అందరికీ సాధ్యమూ కాదు. వారికి చేతనైనంతలో సచ్చరిత్ర వంటి గ్రంథాలను పారాయణ చేసుకుంటారు.

చాగంటి వారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ప్రవచనాలు అన్ని తరగతులవారినీ ఆకర్షిస్తున్నాయి. మనదేశంలో ఎవరి పూజావిధానాలు వారికి ఉన్నా, ఇతర విధానాలను ప్రశ్నించని తత్వమూ అనాదిగా ఉంది. ఈ అవగాహన నుంచి, అనుభవం నుంచి చూసినప్పుడు చాగంటివారి వ్యాఖ్యలు ఆశ్చర్యపరుస్తాయి. రెండేళ్లుగా ఆయన ప్రసంగాలు వింటున్న నేను ఆయన పై వ్యాఖ్యలు చేశారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.




Thursday, July 18, 2013

వాల్మీకి రామాయణం చెప్పాడా, రాశాడా?

వాల్మీకి రామాయణం చెప్పాడా, రాశాడా?

ఈ సందేహం ఈ రోజున చాలామందికి రాదు. ఎందుకంటే మనం రాతకు అలవాటుపడిపోయాం కనుక వాల్మీకి రామాయణం రాశాడనే అనుకుంటాం.

కానీ నిజానికి వాల్మీకి రామాయణం చెప్పాడు’, లేదా చేశాడు’. శిష్యులు ఆయన చెప్పిన శ్లోకాన్ని రాసుకోలేదు, కంఠస్థం చేశారు. రామాయణం చెప్పడం పూర్తి అయిన తర్వాత దీనిని ఎవరు కంఠస్థం చేసి గానం చేస్తారనే వాల్మీకి అనుకున్నాడు. కుశలవులు దానిని కంఠస్థం చేసి గానం చేయడం ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే, నేను చూసిన రామాయణ ప్రతిలో తెలుగు తాత్పర్యం కూర్చిన పండితుడు, వాల్మీకి రామాయణం చెప్పాడు, చేశాడు అని ఉన్న ప్రతిచోటా రచించాడు అనే మాట ఉపయోగించారు! 

భారతీయులు, గ్రీకులు, ఆఫ్రికన్లు అనే తేడా లేకుండా ప్రాచీన కవి, కథకులందరూ కవిత్వం లేదా కథ చెప్పారు, రాయలేదు. తమ కవిత్వం తంత్రీలయబద్ధంగా ఉండాలనుకున్నారు. తాము చెప్పే కథలకు, వీరగాథలకు, వంశచరిత్రలకు తంత్రీలయ నేపథ్యం ఉండేలా చూసుకున్నారు.  

ఇంతకీ విషయమేమిటంటే, కుంటా కింటే వంశచరిత్రను చెప్పే గాథికుని గుర్తించి హేలీకి తెలియజేసిన గాంబియా మిత్రులు ఒక హెచ్చరిక కూడా చేశారు: సంగీత నేపథ్యం లేకుండా గాథికులు నోరు విప్పరట! దాంతో హేలీ ఆ ఆఫ్రికన్ వాల్మీకిని కలుసుకోడానికి ముగ్గురు దుబాషీలు, నలుగురు సంగీతకారులతో సహా పద్నాలుగు మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు.

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/ లో నేను రాస్తున్న 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Wednesday, July 17, 2013

పిచ్చి పట్టిన ఈ వ్యవస్థ తన పిల్లల్ని తనే తినేస్తోంది

కళ్ళు కనిపించని పాము

 తన పిల్లల్ని తనే తినేస్తుందట!

అవినీతి, అక్రమాలు, అలక్ష్యంతో కళ్లుమూసుకుపోయిన ఈ వ్యవస్థ

 తన పిల్లల్ని తనే తినేస్తోంది!

పిల్లలు తినే అన్నంలో పచ్చివిషం కలిపే

ఈ పాషాణ వ్యవస్థను ఏంచేయాలి?!

దేశాన్ని అభివృద్ధి చేస్తామంటారు

ఈ వ్యవస్థకు కేరక్టర్ ఎలా ఇస్తారు?!

పిల్లలన్న కనికరం కూడా లేని

ఈ కర్కోటక వ్యవస్థకు

కారుణ్యపు గుండెను

ఎక్కడినుంచి తెచ్చి అతికిస్తారు?!

ఈ దేశంలో తల్లిదండ్రులు బతికున్నారా?

ఉంటే వాళ్ళ కళ్ళముందే పిల్లలెలా చనిపోతారు?!

ఇది మృత్యుభూమి

ఇక్కడ పుట్టుకల్ని నిషేధించాలి.

(బీహార్ లో విషాన్నం తిని చనిపోయిన పిల్లలకు కన్నీటి తర్పణంతో)




Monday, July 15, 2013

తనే దుర్వార్తగా మారిపోయిన టెలిగ్రామ్!

నిజమే, కాలం మారుతుంది, ప్రపంచం మారుతుంది. కానీ ఇంత త్వరగా మారిపోతుందని అనుకోలేదు. మన సంగతి అలా ఉంచి మన పూర్వులు అస్సలు అనుకుని ఉండరు .

163 ఏళ్ల క్రితం ప్రారంభమైన టెలిగ్రాఫ్ వ్యవస్థ నిన్నటితో కాలగర్భంలో కలసిపోయింది.  'టెలిగ్రామ్' అనే కేక ఇక వినిపించదు. ఆ వాస్తవాన్ని తలచుకున్నకొద్దీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవేదనగా ఉంటుంది. జీవితంలో హఠాత్తుగా ఏదో వెలితి ఏర్పడినట్టు అనిపిస్తుంది. గతంతో, గతజ్ఞాపకాలతో ఉన్న ఒక లింక్ ఒక్కసారిగా తెగిపోయినట్టు అనిపించి మాటలకు అందని విషాదంతో మనసు బరువెక్కిపోతుంది.

టెలిగ్రామ్ దుర్వార్తలనే కాదు శుభవార్తలనూ మోసుకొచ్చేది. కానీ ఎందుకో టెలిగ్రామ్ అనే కేక వినగానే దుర్వార్తనే శంకించేవాళ్ళం. ఎప్పుడైనా టెలిగ్రామ్ వస్తే మా అమ్మ చాలా ఆందోళన పడేది. ఎక్కడి పని అక్కడే ఆపేసి వంటింట్లోంచి బయటకు వచ్చేసేది. సంతకం పెట్టి టెలిగ్రామ్ తీసుకుని అందులో ఏముందో చదివి చెప్పడానికి పట్టే ఆ అయిదారు నిమిషాల వ్యవధిలోనే ఎక్కడలేని టెన్షన్ నూ అనుభవించేది. "నా కాళ్ళూ చేతులూ ఆడడం లేదు, త్వరగా చదివి చెప్పరా" అనేది.

దుర్వార్తాహరిగా అనుకునే టెలిగ్రామ్ ఇప్పుడు తనే ఒక దుర్వార్తగా మారిపోయింది.

టెలిగ్రామ్ కాలధర్మం చెందినా దుర్వార్తలు ఉంటూనే ఉంటాయి. అయితే దుర్వార్తకూ, టెలిగ్రామ్ కూ ఉన్న ప్రత్యేకమైన ముడి ఇంకే సమాచార సాధనానికీ ఉండకపోవచ్చు. సెల్ ఫోన్ శుభ/అశుభ వార్తల మధ్య తేడాను చెరిపేసింది. సెల్ మోగగానే దుర్వార్తలను శంకించేవాళ్లు ఎవరూ ఉండరు.

నేను టెలిగ్రామ్ ను, అది కూడా ఒక అశుభవార్తను మోసుకొచ్చిన టెలిగ్రామ్ ను చివరిసారి అందుకున్నది... నాకు గుర్తున్నంతవరకూ 1995 మార్చ్ లో!

ఒక జీవిత కాలంలోనే మనం అనేక మార్పులు చూస్తున్నాం. కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేస్తుందని అంటారు కానీ అది మనకు ప్రత్యక్షంగా కనబడదు. కానీ కొత్త టెక్నాలజీ వచ్చి పాత టెక్నాలజీని పక్కకు తోసేయడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పదేళ్ళ కాలంలో ఒక్క  సెల్ ఫోన్ లలోనే ఎన్ని మార్పులు? 2జీ, 3జీ కూడా పాతబడి ఇప్పుడు 4జీ అంటున్నారు. 2జీ కుంభకోణం కేసు ఒక కొలిక్కి వచ్చేలోపల ఇంకా ఎన్ని జీలు వస్తాయో?

మన పూర్వులకీ మనకీ ఇదే తేడా. వారు తమ జీవితకాలంలో ఇన్ని మార్పులు చూసి ఉండరు. టెలిగ్రాము, పోస్ట్ కార్డ్ ల సాహచర్యంతోనే వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి. మన కళ్ళముందే ఒక్కొక్కటే కనుమరుగైపోతూ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతున్న విషాదం ప్రత్యేకంగా మనదే.

టెలిగ్రామ్ పోయినా టెలిగ్రామ్ అనే కేక మన చెవుల్లో మరికొంతకాలం గింగురు మంటూనే ఉంటుంది. ఆ తర్వాత ఆ కేక కూడా ఆగిపోతుంది.

టెలిగ్రాముకు కన్నీటి వీడ్కోలు!

Saturday, July 13, 2013

పేరులో అక్షరం మారితే జాతకం మారుతుందా?!

"మీ పేరులో ఒక దుష్టాక్షరం ఉంది. అందుకే మీరు ఏది తలపెట్టినా జరగడంలేదు. మీ పేరులో ఒక్క అక్షరాన్ని మార్చుకుంటే చాలు మీరు ఏది ముట్టుకున్నా బంగారమవుతుంది"

ఇలా చెప్పే జ్యోతిష్కులు చాలామంది టీవీ చానెళ్లలో కనిపిస్తున్నారు. టీవీ చానెళ్లు వాళ్ళతో ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకే చానెల్ ఇలాంటి ముగ్గురు, నలుగురితో కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. అంతేకాదు, వాళ్ళ అపాయింట్ మెంట్ తీసుకోడానికి ఫోన్ నెంబర్లు ఇస్తోంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ ఊళ్ళల్లో ఉండేదీ చెబుతోంది. వాళ్ళ పర్యటన వివరాలు ఇస్తోంది. ఇవి వాణిజ్య ప్రకటనల లానూ,  వీరితో ప్రసారం చేసే ప్రశ్నోత్తరాల కార్యక్రమం వీరికి ప్రాచుర్యం కల్పించడానికి ఉద్దేశించిన 'టీజర్ల' లానూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా రుద్రాక్ష వ్యాపార ప్రకటనల లాంటివే. ఈ రకమైన జ్యోతిషంతో ఎంత వ్యాపారం జరుగుతోందో తెలియదు. దీనిపై ఎవరూ దృష్టి పెట్టినట్టు కనిపించదు.

జ్యోతిషం అనేసరికి చాలామందికి ఉత్సుకత ఉంటుంది. పెద్దగా నమ్మనివారు కూడా తమ గురించి ఏం చెబుతారో నన్న ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పోయేదేముంది, ఒక ఫోన్ కాలే కదా అనుకుని ప్రయత్నిస్తారు. కానీ ఎన్నిసార్లు డయల్ చేసినా చానెల్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ దొరకదు. గాఢంగా నమ్మేవాళ్లు అక్కడినుంచి నేరుగా ఆ జ్యోతిష్కుని కాంటాక్ట్ చేస్తారు. బహుశా ఆ నెంబర్ తేలిగ్గా కలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలిపే జవాబుదారీ ఆ టీవీ చానెల్ కు సహజంగానే ఉండదు.

ఇక్కడ కూడా విశ్వాసాన్ని ప్రశ్నించనవసరం లేదు. మనిషికి ఏదో ఒక విశ్వాసం ఉండడం సహజం. అయితే అదే సమయంలో వివేకమూ ఉండాలి. పేరులో ఒక అక్షరం మార్చుకున్నంత మాత్రాన జీవితం బాగుపడిపోతుందా, కష్టనష్టాలనుంచి అవలీలగా బయటపడగలుగుతామా అని క్షణకాలం ఆగి ఆలోచించాలి. తన పేరే ఉన్నవారు అంతా తమలానే ఇబ్బందుల్లో ఉన్నారా అని ఆలోచించాలి, వారిలో ఎంతమంది మంచి స్థితిలో ఉన్నారో చూడాలి. తల్లిదండ్రులు చేసిన నామకరణంలో, లేదా వాళ్ళు చిన్నప్పటినుంచీ పిలిచిన ముద్దు పేరులో వాళ్ళ ఆశీస్సులు కూడా కలిసి ఉంటాయి. అంతకుమించిన గొప్ప ఆశీస్సులు ఎవరినుంచీ అందే అవకాశం లేదు. మన శ్రేయస్సును తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆశించేవారూ ఉండరు. కనుక వారు పెట్టిన, పిలిచిన  పేర్లు చెరుపు చేస్తాయా అని  ఆలోచించాలి.

జ్యోతిషం శాస్త్రమా కాదా అన్న చర్చలోకీ లోతుగా వెళ్ళనవసరం లేదు. శాస్త్రం కాదని ఇట్టే తీర్పు ఇవ్వనూ అవసరం లేదు. జ్యోతిషం శాస్త్రమే అయుండచ్చు. అయితే, "రెండురెళ్ళు నాలుగు" అన్నంత కచ్చితంగా జాతకం చెప్పగలిగినవారు తారసపడేవరకూ మీరు ప్రతివారినీ నమ్మనవసరం లేదు. ఏ ఇద్దరు జ్యోతిష్కులు చెప్పేదీ కలవనంతకాలం, ఏ ఒక్కరు చెప్పిన జాతకఫలం నిజం కానంత కాలం జ్యోతిష్కులను అనుమానంగా చూడక తప్పదు. ఫలానా జ్యోతిష్కుడు చెప్పింది నిజమైంది, ఎందుకు ఆయనను నమ్మకూడదని మీరు అనుకోవచ్చు. అదే జ్యోతిష్కుడు మీ విషయంలో చెప్పిన వాటిలో నిజం కానివీ ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. "అయితే మగ లేదా ఆడ" అన్నట్టుగా కొన్ని నిజమవుతుంటాయి. నమ్మకానికి వాటిని ప్రమాణంగా తీసుకోకూడదు.

నా స్వానుభవం ఒకటి చెబుతాను. నేను పనిచేసిన ఒక దినపత్రికలో ఒక సిద్ధాంతిగారు వారఫలాలు, సంవత్సర ఫలాలు రాస్తూ ఉండేవారు.  ఆ ఏడాది తను సంవత్సరఫలాలు రాసిన సంచిక తీసుకుని ఓ రోజు ఆయన  నా దగ్గరకు వచ్చారు. "చూడండి, కేంద్రంలో అధికారపరివర్తన జరుగుతుందని రాశాను, అదే జరిగింది" అంటూ నా ముందు  ఆ సంచిక ఉంచారు. యథాలాపంగా తెరచి చూశాను. నిజమే, ఆయన ఆ మాట రాశారు. ఆయనను అభినందించాను. "ఒక రిక్వెస్ట్. నా జోస్యం నిజమైనట్టు చెబుతూ ఒక వార్త ప్రచురించాలి మీరు" అని ఆయన అడిగారు. "సరే ప్రచురిస్తాం. అయితే ఒక షరతుతో" అని నేను అన్నాను. "ఏమిటో చెప్పండి" అని ఆయన అన్నాడు. "మీరు చాలా ఏళ్లుగా సంవత్సరఫలాలు రాస్తున్నారు కదా...మీ జోశ్యాలు ప్రతిసారీ నిజం అయ్యాయా?" అని అడిగాను. ఆయన ముఖంలో రంగులు మారాయి. "ప్రతిసారీ ఎందుకు నిజమవుతాయి. ఏ జ్యోతిష్కుడి అంచనాలైనా ఒక్కొక్కసారి తప్పుతాయి" అని ఆయన అన్నాడు. అదీ వాస్తవం! "ఈ ఏడాది మీ జోస్యం నిజమైందని ప్రకటించడానికి అభ్యంతరం లేదు. దాంతోపాటు మీ విఫల జోశ్యాలను కూడా ప్రకటించాలి. అదే న్యాయం. అవునా, కాదా చెప్పండి?" అన్నాను. "అదెలా కుదురుతుంది?" అని ఆయన అని అక్కడితో సంభాషణ ఆపేశారు.

ఆయన కోరినట్టు వార్త ప్రచురిస్తే ఆయనకు మరింత  పేరు వచ్చి డిమాండ్ పెరగచ్చు. కానీ జ్యోతిషానికీ,  జ్యోతిష్కులను నమ్మేవారికీ ఆ వార్త వల్ల న్యాయం జరగుతుందా? ఆలోచించండి.  

Thursday, July 11, 2013

ఆఫ్రికన్ వ్యాసవాల్మీకులు

శిశువు చిత్రనిద్రలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు

అన్న శ్రీశ్రీ కవితా వాక్యం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది.  పురాచరిత్రలో, పురావస్తువులలో ప్రాచీనస్మృతులూచే చప్పుడు వినగలిగే చెవి ఉన్నవారందరికీ ఎలెక్స్ హేలీతో చుట్టరికం కలుస్తుంది.  అతని కథ సొంత కథలానే అనిపిస్తుంది. రోసెట్టా శిలను చూసినప్పుడు అతని కళ్ళలో తళుక్కుమన్న మెరుపునూ, అతని హృదయస్పందననూ వారు పోల్చుకోగలరు. న్యూయార్క్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి వెళ్ళినప్పుడు, వేల సంవత్సరాల క్రితం శిలగా ఘనీభవించిపోయిన ఒక వృక్షఖండాన్ని చూసి నేను అటువంటి సంచలనానికే లోనయ్యాను. అక్కడే బాబిలోనియా చక్రవర్తి హమ్మురాబి శిక్షాస్మృతిని చెక్కిన శిలను చూశాను. ఆధునిక చరిత్రకారులను ప్రామాణికంగా తీసుకుంటే హమ్మురాబి(క్రీ.పూ. 1750) మన మహాభారత కాలానికి కూడా వెనకటి వాడన్న సంగతి గుర్తొచ్చి కన్నార్పకుండా దానినే చూస్తూ ఉండిపోయాను. 

ఇప్పటికీ ఎలెక్స్ హేలీ మన బంధువే నన్న విశ్వాసం మీకు కలగకపోతే ఇంకో విషయం చెబుతాను.  అతను తన పూర్వీకుడైన కుంటా కింటే జన్మస్థలాన్ని వెతుక్కుంటూ వెళ్లింది ఎక్కడికో కాదు; మనమూ, మనతోపాటు ప్రపంచమంతా ఒకనాడు జీవించిన గతంలోకి! గణసంస్కృతిలోకి!  గణదశలో ప్రపంచ మానవాళి ఒకే అనుభవాలను, ఒకే విధమైన సెంటిమెంట్లను, చివరికి ఒకే విధమైన పురాణగాథలను పరస్పరం పంచుకున్నారు.

ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యపోకండి... ఎలెక్స్ హేలీ  తన పూర్వీకుని జన్మస్థలానికి వెళ్ళి అక్కడ దర్శించినది మరెవరినో కాదు;  మన వాల్మీకినీ, వ్యాసునీ, వైశంపాయనునీ; గ్రీకుల హోమర్ ను, హెసియాడ్ నే! పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో 1966లో అతను దర్శించిన ఆ వ్యాస/వాల్మీకి/ హోమర్ పేరు:  కెబ్బా కంజీ పొఫానా!

(పూర్తి వ్యాసం http://www.saarangabooks.com/magazine/లో నా 'పురా'గమనం అనే కాలమ్ లో చదవండి)

Saturday, July 6, 2013

ఔట్ సోర్సింగ్ పూజలు, కొరియర్ ప్రసాదాలు!

నా దగ్గరి బంధువు ఒకామెకి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ అమ్ముకోవాలనుకుంది.  చాలాకాలంగా తెలిసిన ఓ స్నేహితురాలు అమ్మి పెడతానని చెప్పి డాక్యుమెంట్లు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని మాసాలకు తన సంతకం ఫోర్జరీ చేసి ఫ్లాటును ఎవరికో అమ్మేసినట్టు తెలిసింది. వాళ్ళు ఫ్లాట్ ను ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది, కోర్టుల సంగతి తెలిసిందే కదా. ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఇప్పటికే వేల రూపాయిలు ఖర్చు పెట్టింది.

అదలా ఉండగా, తిరుపతిలో ఉండే ఒకాయన పూజలు చేసి ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తారని తెలిసి ఆయన ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడింది. నా పూజతో మీ సమస్య ఇట్టే పరిష్కారమై పోతుందనీ, నేను తిరుపతిలోనే ఉండి పూజ చేస్తాననీ, డబ్బు ఖర్చు పెట్టుకుని మీరు కూడా రావలసిన అవసరం లేదనీ, తర్వాత కొరియర్ లో ప్రసాదం పంపిస్తాననీ, మీరు చేయవలసిందల్లా 15వేల రూపాయిలు చెక్కు పంపించడమే ననీ ఆయన చెప్పాడు. ఆమె క్షణకాలం సంశయించడం గమనించి, అందులో నేనేమీ తీసుకోననీ, అంతా పూజలకే ఖర్చవుతుందనీ, పని జరిగాక మీ సంతోషం కొద్దీ ఏమైనా ఇస్తే తీసుకుంటాననీ అన్నాడు. ఆలోచించి చెబుతానని ఆమె అంది,

నాతో ఈ విషయం చెప్పి డబ్బు పంపనా అని అడిగింది. వద్దు, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, మరికొన్ని వేలు నష్టపోవద్దని చెప్పాను. దాంతో ఆమె ఊరుకుంది.

ఇలాంటి వ్యాపారమూ, బేరసారాలు ఎక్కడైనా ఉంటాయా చెప్పండి? ఆయన తిరుపతిలోనే ఉండి పూజలు చేస్తాడట! పూజ చేయించుకునే మనిషి కూడా రావలసిన అవసరం లేదట! డబ్బు పంపితే చాలట! ఆయన పూజ చేశాడని నమ్మకమేమిటి? అదే విశ్వాసం మహిమ. మీరు పూజ చేశారో లేదో మాకు ఎలా తెలుస్తుందని సమస్యల్లో ఉన్నవారు అడగరనీ, ఏం చెప్పినా నమ్మేస్తారనీ ఆయన నమ్మకం. నిజంగానే అలా అడగని వాళ్ళు, డబ్బు పంపేసేవాళ్లూ ఉంటారు. ఏదో విధంగా సమస్య పరిష్కారం అయిపోతే బాగుండునన్న ఆతృత వారిని అలా నమ్మేలా చేస్తుంది. ఆ నమ్మకాన్ని కొల్లగొట్టి సొమ్ము చేసుకోవడమే అవతలివాళ్ళకు బతుకుతెరువు. తిరుపతి మనిషి లాంటివారు ఒకరు కాదు లక్షల్లో ఉంటారు.

చిట్ ఫండ్ కంపెనీల మోసాల గురించి వింటుంటాం. నిజానికి విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని చేసే వ్యాపారాలు, మోసాలు అంతకన్నా పెద్దవి. మోసపూరిత చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళు డబ్బుతో పరారీ అయ్యే ముందు కొంతకాలమైనా మన ఎదురుగా ఉంటారు. వాళ్ళకో ఆఫీసూ, చిరునామా ఉంటాయి. మనిషి కనిపించకుండా పోస్ట్ ద్వారా లావాదేవీలు జరిపే వారి కన్నా ఆమేరకు వారు నయమే కదా!

ముందు పూజలు చేయండి, పని జరిగిన తర్వాత డబ్బు ఇస్తామని అంటే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు ముందుకొస్తారా? రారు. ఎందుకంటే తమ పూజ వల్ల పని జరుగుతుందన్న నమ్మకం వాళ్లకూ ఉండదు కనుక. మరి పూజా సామగ్రికీ, ఆయన వెచ్చించే కాలానికీ, శ్రమకీ ప్రతిఫలం ఇవ్వద్దా అన్న ప్రశ్న రావచ్చు. అందుకు కావాలంటే కొంత మొత్తం పంపచ్చు. మిగతాది పని జరిగాక ఇస్తామని చెప్పచ్చు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా?  అదీగాక ఎక్కడో ఉండి పూజలు చేస్తాం, మీరు నమ్మండి అనడం ఎలా కుదురుతుంది?

విశ్వాసం తప్పుకాదు. వివేకం లోపించిన విశ్వాసంతోనే ముప్పు. 

Friday, July 5, 2013

రుద్రాక్షలు ఇంత పెద్ద వ్యాపారమా?!

రుద్రాక్షల మహిమ గురించి టీవీ చానెళ్లలో చాలాకాలంగా వాణిజ్య ప్రకటనలు వస్తున్నాయి కానీ, ఆ వ్యాపారం ఇంతగా ఊహించని రేంజికి చేరుకుంటుందని అనుకోలేదు. ఈ మధ్య హైదరాబాద్ లో ఒకచోట రుద్రాక్షల వ్యాపారానికి సంబంధించిన ఒక పెద్ద హోర్డింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఆ వ్యాపారం కార్పొరేట్ వ్యాపార స్థాయిని అందుకున్నట్టుందని దానిని చూడగానే అనిపించింది.

రుద్రాక్షలకు మహిమ ఉంటుందన్న విశ్వాసం అనాదిగా ఉన్నదే. రుద్రాక్షమాలలు చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. వాటిని ధరించే వాళ్ళూ చాలామందే కనిపిస్తారు. ఏకముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష వగైరా పేర్లు టీవీ చానెళ్లలో ప్రచారానికి చాలా ముందునుంచే; టీవీ కూడా లేని రోజులనుంచే పూజాపునస్కారాలు చేసే  కుటుంబాలలో వినబడుతూ ఉండేవి. హిమాలయప్రాంతాలవైపు వెళ్లినప్పుడు వాటిని తెచ్చుకోవడమూ ఉండేది. కానీ రుద్రాక్ష ధారణ జరుగుతున్న ఇన్నేళ్లలోనూ అది ఒక భారీ వ్యాపారంగా ఎప్పుడూ మారలేదు. ఇప్పుడే మారడం చూస్తున్నాం.

భారీవ్యాపారం అన్నాక అన్ని వ్యాపారాలకూ వర్తించే ప్రమాణాలు, సూత్రాలు, పారదర్శకత మొదలైనవి ఈ వ్యాపారానికి కూడా వర్తించవలసిందే కదా? వర్తిస్తున్నాయా? వినియోగదారులు మోసపోకుండా చూసే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ మేము మోసపోయామని వారు ఫిర్యాదు చేస్తే పరిహారం ఇప్పించడం వగైరా చర్యలు తీసుకునే వ్యవస్థ ఏమైనా ఉందా?

"రుద్రాక్షలకు మహిమ ఉంటుందన్న్దది  కేవలం విశ్వాసం మాత్రమే, ఆ మహిమ కొందరికి అనుభవంలోకి రావచ్చు; కొందరికి రాకపోవచ్చు, దానికి హామీ ఎలా ఇస్తాం?  రుద్రాక్ష వినియోగదారులను ఇతర వినియోగదారులతో ఎలా జమ కడతాం? కనుక వారికి consumer protection ఎలా ఇస్తాం?" అని రుద్రాక్ష వ్యాపారులు వాదించవచ్చు. లేదా ఇతరులకే అలాంటి సందేహాలు కలగచ్చు.

అయితే ఇక్కడ ఒక తేడా గమనించాలి. రుద్రాక్షలు ఇలా భారీ వ్యాపారంగా మారని రోజుల్లో వాటి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు తమంతట తాము కొనుక్కుని లేదా సంపాదించుకుని తెచ్చుకునే వాళ్ళు. టీవీ చానెళ్లు, లేదా భారీ హోర్డింగ్ ల ప్రచారానికి ప్రభావితులై కాదు. వాటిని అమ్మే వ్యక్తులో లేదా చిన్నపాటి దుకాణాలవారో వాటి మహిమ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు కాదు. కనుక అటువంటి సందర్భాలలో కొనుక్కున్న వారిదే పూర్తి బాధ్యత.

ఇంకొంచెం తేలిగ్గా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తిరుపతి వేంకటేశ్వరస్వామి మీద విశ్వాసం ఉన్న భక్తులు ఆయనను దర్శిస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో స్వచ్ఛందంగా తిరుమలకు వెడతారు. అందుకు వెచ్చించే శ్రమకు, ఖర్చులకు, అక్కడ హుండీలో వేసే డబ్బులకు పూర్తి బాధ్యత వాళ్ళదే.

అలా కాకుండా తిరుమలేశునికి గొప్ప మహిమలు ఉన్నాయనీ, ఆయనను  దర్శిస్తే మీకు ఫలానా ఫలానా మంచి జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వారే భారీ ఎత్తున ప్రకటనలను ప్రసారం చేస్తే, హోర్డింగ్ లను ఏర్పాటు చేస్తే, వాటిని చూసి భక్తులు ఆకర్షితులై ఇప్పటి కంటే పెద్ద సంఖ్యలో తిరుమలకు వెడితే అప్పుడు బాధ్యత టీ.టీ.డీ వారిదే అవుతుంది. వారు అలా చేయడం లేదు కనుక తమ తిరుమల యాత్రకు భక్తులే బాధ్యత వహించాలి. తిరుమలకే కాదు, ఏ గుడి కైనా, జ్యోతిషం వగైరా ఏ విశ్వాసాలకైనా ఇదే వర్తిస్తుంది.

ఇందుకు భిన్నంగా రుద్రాక్ష వ్యాపారులు రుద్రాక్షల మహిమ గురించి భారీ ఎత్తున ప్రచారం చేస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు కనుక వారికి జవాబుదారీ ఉండనవసరం లేదా? ఆ వ్యాపారానికి ఇతర వ్యాపారాలకు వర్తించే సూత్రాలు, ప్రమాణాలూ వర్తించనక్కరలేదా?

ఇవే ప్రశ్నలు జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం వగైరాలకూ వర్తిస్తాయి. అవునా? కాదా?


Wednesday, July 3, 2013

అమ్మమ్మలు బతికించిన చరిత్ర

నలుగురు కూచుని నవ్వే వేళల, నా పేరొకపరి తలవండి 
గుర్తొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తి మాటల కందని మహా విషాదాన్ని మోస్తున్నట్టు, ఆ విషాదాన్ని చుక్క చుక్కలుగా మన గుండెల్లోకి జార్చుతున్నట్టు అనిపిస్తుంది. లోపల ఎక్కడో కలుక్కుమంటుంది. గురజాడవారి పూర్ణమ్మ కథలోని పంక్తి ఇది. తనను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు మనస్తాపం చెందిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. దుర్గగుడికి వెళ్ళే నెపంతో బయలుదేరుతూ తోబుట్టువులను చుట్టూ కూర్చోబెట్టుకుని అప్పగింతలు చెబుతుంది. ఆ సందర్భంలో పై మాట అంటుంది.
ఏళ్ల తరబడి మన మధ్య గడిపిన రక్తబంధువులు హఠాత్తుగా తిరిగిరాని లోకాలకు తరలిపోయి కనుమరుగు కావడం ఆదిమదశనుంచీ మనిషిలో విషాదాన్ని గిలకొట్టుతూనే వచ్చింది. వారి స్మృతిని సజీవం, చిరంజీవం చేసే ఆలోచనలు అప్పుడే పుట్టాయి. అందులో భాగంగానే పితృదేవతలు అనే భావనా, పితృకర్మలూ విశ్వాసంలో భాగమయ్యాయి. ప్రపంచ పురాణగాథల కెక్కాయి. రక్తబంధువులందరూ ఏకశరీరంగా జీవించిన గణసమాజంలో ఈ విషాదవిశ్వాసాలు మరింత బలీయంగా ఉంటాయి. లిపి ఏర్పడని, లేదా లిఖిత సంప్రదాయం వేళ్లూనుకోని కాలంలో గణబంధువుల జ్ఞాపకాలను, చరిత్రను తరం నుంచి తరానికి అందించే బాధ్యతను మనిషి గళమే నిర్వహించింది. అలా అందించడం ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇది ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా జరిగింది.
 పైన పేర్కొన్న గురజాడ పంక్తిలోని విషాదం గణహృదయపు లోతుల్లోంచి పలుకుతున్న విషాదంలా నాకు అనిపిస్తూ ఉంటుంది. గణసమాజపు నుడికారం గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుందని  రాంభట్ల కృష్ణమూర్తి అనేవారు. కన్యాశుల్కం నుంచి అనేక ఉదాహరణలు ఎత్తి చూపేవారు.
అదలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, నలుగురూ కూర్చుని తమ పూర్వీకులను స్మరించుకునే గణ సంప్రదాయం రూట్స్ రచనలో 
రెండువందల ఏళ్ల క్రితం నాటి వంశ మూలాలను, మూలస్థానాన్ని కనిపెట్టే ఉత్కంఠభరిత ప్రయత్నానికి దారితీయించింది.  

(పూర్తి వ్యాసంhttp://www.saarangabooks.com/magazine/ లో 'పురా'గమనం అనే నా కాలమ్ లో చదవండి)


Monday, July 1, 2013

ముండే కేసు: స్టేట్ ఫండింగ్ ఎలా పరిష్కారం?!

 కిందటి (2009) లోక్ సభ ఎన్నికలలో తను ఎన్నికల కమిషన్ అనుమతించిన 25 లక్షల రూపాయల పరిమితి కంటే చాలా ఎక్కువగా , ఏకంగా 8 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టానని  ఒక సభలో బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ప్రకటించారు. ఆయన మాటలు రికార్డ్ అయ్యాయి. మీడియాలో ప్రసారమయ్యాయి. దాంతో ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీస్ ఇచ్చింది. తన లాయర్ ద్వారా ఆ నోటీసుకు సమాధానం పంపుతానని ముండే ప్రకటించారు. ఏం సమాధానం ఇస్తారో, ఎన్నికల కమిషన్ దానిపై ఎలా స్పందిస్తుందో చూడవలసిందే.

దీనిపై బీజేపీ అధికారప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ సమాధానం చెబుతూ, ముండే వ్యక్తిగతంగా 25 లక్షల పరిమితిలోనే ఖర్చు పెట్టారని, మిగతా మొత్తాన్ని ఆయన మద్దతుదారులు ఖర్చుపెట్టి ఉండచ్చని ఒక విచిత్ర భాష్యం చెప్పారు. ఆయన వివరణ ప్రకారం వ్యక్తిగతంగా నిర్దేశించిన పరిమితిలోనే ఖర్చు పెట్టాలి కానీ, ఆ అభ్యర్థి మీద ఇతరులు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఆ ఖర్చు 8 కోట్లు కావచ్చు, 80 కోట్లు కావచ్చు. తప్పులేదు! అటువంటప్పుడు ఇంత మొత్తమే ఖర్చుపెట్టాలన్న నిబంధన దేనికో?!

నిజానికి అనేక మంది చేసిందీ, చేస్తున్నదే ఆయనా చేశారు. ఎన్నికల్లో ఖర్చు పరిమితి నిబంధన కాగితాలకే పరిమితమని అందరికీ తెలుసు.  కాకపోతే ముండే  ఆ వాస్తవాన్ని బహిరంగంగా  ఒప్పుకున్నారు. అదే తేడా. అయితే,  ఆయన  'నిజం' చెప్పడంలో నిజాయితీ ఉందనుకోవాలో, లేకపోతే ఎన్నికల కమిషన్ ను కాగితం పులిగా పరిగణించి అదేం చేస్తుందిలే అన్న తెగింపు ఉందనుకోవాలో తెలియని పరిస్థితి. పైగా, ఏం చేస్తారో చేసుకోండని సవాలు చేస్తున్నట్టుగా  ఈ లోక్ సభ గడువు ఇంక ఆరునెలలే ఉందని కూడా అన్నారు.

అదలా ఉండగా, అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం ఇటువంటి సమస్యలకు పరిష్కారమనే అభిప్రాయాన్ని ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భమనేముంది, అతి కీలకమైన ఎన్నికల సంస్కరణలలో ఒకటిగా ఆ ప్రతిపాదన చాలాకాలంగా చర్చలో ఉంది. ఇక్కడ సందేహమేమిటంటే, ప్రభుత్వమే ఎన్నికల ఖర్చు భరిస్తే అభ్యర్థి సొంతంగా కోట్లు వెదజల్లడం మానేస్తాడా? అప్పుడు కూడా వోటర్లను ఏదో ఒక రూపంలో ప్రలోభపెట్టడానికి లోపాయికారీగా కోట్లు కుమ్మరించే అవకాశం లేదా? వెనకటికి ఒకావిడ మడి బట్ట తలుపుకి ఆరేసి ఏ దొంగ ఇంట్లోకి వస్తాడో చూస్తానని అందట! అలాగే, ప్రభుత్వం ఖర్చు పెడుతోంది కనుక  దానికి బుద్ధిగా కట్టుబడి అభ్యర్థి సొంతంగా ఖర్చు పెట్టకుండా ఉండిపోతాడా?!

ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని భరించాలన్న ప్రతిపాదన వెనుక  మామూలు బుద్ధికి అందని హేతుబద్ధత ఏదో ఉందనుకుంటే  దయచేసి అదేమిటో  విజ్ఞులు సెలవిస్తారా?