Wednesday, May 29, 2013

త్రివేణి వక్కపొడి ప్రకటన...క్రికెట్ కవరేజ్...

కొన్నేళ్ళ క్రితం రేడియోలో త్రివేణి వక్కపొడికి సంబంధించిన వాణిజ్య ప్రకటన వస్తుండేది(ఇప్పుడు కూడా వస్తోందేమో, గమనించలేదు). త్రివేణి వక్కపొడి ఇమ్మని దుకాణదారుని వివిధ భాషల్లో అడుగుతూ ఉంటారు. త్రివేణి వక్కపొడిని అన్ని రాష్ట్రాలవారూ ఆదరిస్తున్నారని చెప్పడం ఆ వాణిజ్యప్రకటన ఉద్దేశం. ఇలా ఇంతమంది ఇన్ని భాషల్లో అడగడం గమనించిన ఓ వ్యక్తి, "ఏమిటీ, త్రివేణీ వక్కపొడికి ఇంత డిమాండా?!" అంటూ ఆశ్చర్యంగా నోరు వెళ్లబెడతాడు.

హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేసే ఒకరిద్దరు మిత్రులు చెప్పిన ప్రకారం ఈ ప్రకటన వెనుక ఓ చిన్న తమాషా ఉంది.  ప్రకటనను రికార్డ్ చేస్తున్న సమయంలో ప్రముఖచిత్రకారుడు చంద్ర అక్కడికి వెళ్లారట. త్రివేణీ వక్కపొడిని అంతమంది అన్ని భాషల్లో అడగడం గమనించిన చంద్ర అప్రయత్నంగా ఆ చివరి వాక్యం అన్నారట. రికార్డ్ చేయిస్తున్న వ్యక్తికి ఆ మాట బాగా నచ్చిందట. "బాగుంది, మళ్ళీ అనండి, ప్రకటనలో కలుపుదాం" అని పట్టుబట్టారట. ఆ విధంగా అది ఆ ప్రకటనలో చేరింది. "అలాగా" అనుకోవడమే కానీ ఇందులో నిజానిజాలు ఏమిటో ఎప్పుడూ ఆరా తీయలేదు. చంద్ర బాగా తెలిసిన మిత్రుడే అయినా ఆయననూ ఎప్పుడూ అడగలేదు.

ఇప్పుడు ఈ  త్రివేణి వక్కపొడి ప్రకటన ఎందుకు గుర్తొచ్చిందంటారా? కారణం, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజులతరబడి నిరవధికంగా కొనసాగుతున్న IPL క్రికెట్ బెట్టింగ్/ఫిక్సింగ్ కుంభకోణం కవరేజ్. ఈ దేశంలో క్రికెట్ కు ఎంతో డిమాండ్ ఉన్న సంగతి నిజమే కానీ, మీడియా కవరేజ్ చూస్తుంటే "మరీ ఇంత డిమాండా?!" అని ఆశ్చర్యంతో('దిగ్భ్రాంతి' ఇంకా మంచి మాటేమో!)నోరు వెళ్లబెట్టక తప్పడం లేదు.

మధ్యలో ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలతో సహా పాతికమందిని పైగా హతమార్చిన ఘటన జరిగి ఉండకపోతే వార్తా చానెళ్ల క్రికెట్ కవరేజ్ యజ్ఞం మరింత నిర్విఘ్నంగా, నిరాఘాటంగా కొనసాగి ఉండేది. కానీ దిక్కుమాలిన ఆ ఘటన ఆ కవరేజ్ తపస్సును భగ్నం చేసింది. క్రికెట్ మీద ఫోకస్ తగ్గించకుండానే, వినాయకునితోపాటు ఆయన వాహనమైన ఎలుకను చూపించినట్టుగా, ఛత్తీస్ గఢ్ వార్తనూ చూపించవలసి వచ్చింది. అలా ప్రైమ్ టైమ్ ను సర్దుబాటు చేసుకోవడంలో సంపాదకవర్గం పాపం ఎంత కసరత్తు చేయవలసి వచ్చిందో!

 క్రికెట్ కుంభకోణం పై ఇరవై నాలుగు గంటల వార్తా చానెళ్ల నిరంతర వార్తాప్రసారం ఎప్పటికీ ఆగుతుందో తెలియడం లేదు. బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్ రాజీనామా చేస్తే ఆగుతుందా? ఆ ఆశా కనిపించడం లేదు.క్రికెట్ కుంభకోణాన్ని మించిన రాజకీయ కుంభకోణం ఏదైనా బద్దలైతే తప్ప రాజకీయాలపై ఇప్పట్లో మీడియా ఫోకస్ కు అవకాశం కనిపించడం లేదు. రాజకీయనాయకులు తొందరపడాలి. ఏదో ఉపాయం ఆలోచించాలి. అందులోనూ రానున్నది ఎన్నికల సమయం! 

Friday, May 24, 2013

IPL ముందు 'ఇండియన్ పోలిటికల్ లీగ్' ఏపాటి?!

మీడియాలో IPL  స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కవరేజ్ చూస్తుంటే చాలాకాలం క్రితం చదివిన ఒక జోక్ గుర్తొచ్చింది.

 ఓ విదేశీయుడు మొదటిసారి హైదరాబాద్ వచ్చాడు. ఓ ట్యాక్సీలో ప్రయాణం చేస్తున్నాడు.  అసెంబ్లీ పక్కనుంచి ట్యాక్సీ వెడుతుండగా దానిని చూపించి ఈ భవనం ఎవరిదని డ్రైవర్ ను అడిగాడు. 'పతానై' అని డ్రైవర్ జవాబిచ్చాడు. ఆ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్స్ ను చూపించి ఇది ఎవరిదని అడిగాడు. డ్రైవర్ 'పతానై' అన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హుస్సేన్ సాగర్ కనిపించింది. దీనిని ఎవరు నిర్మించారని అడిగాడు. డ్రైవర్ 'పతానై' అన్నాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక శవయాత్ర కనిపించింది. పూల దండలతో కప్పేసిన శవం వెంట ఆడామగా చాలామంది వెడుతున్నారు. దారి పొడవునా కూడా పూలు జల్లుతున్నారు. 'ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు?' అని విదేశీయుడు డ్రైవర్ ను అడిగాడు. యథాప్రకారం అతను 'పతానై' అన్నాడు.

తను దిగిన హోటల్ కు చేరుకున్నాక ఆ విదేశీయుడు డైరీలో ఇలా రాసుకున్నాడు: "హైదరాబాద్ లో 'పతానై' అనే  ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి పెద్ద పెద్ద భవనాలు, తోటలు ఉన్నాయి. అతను నగరం మధ్యలో ఒక పెద్ద చెరువు నిర్మించాడు. విచిత్రంగా 'పతానై' ఈ రోజే చనిపోయాడు. అతని శవాన్ని పూలతో కప్పి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఎంతోమంది ఆ శవయాత్రలో పాల్గొన్నారు."

అలాగే, భారతదేశం గురించి, క్రికెట్ గురించి ఏమీ తెలియని వారు మీడియాలో రోజుల తరబడిగా సాగుతున్న IPL స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కవరేజ్ చూస్తున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు భారతదేశం గురించి బహుశా ఇలా అనుకుంటారు:

 "భారతీయులు  క్రికెట్ అనే ఆటను ఎక్కువగా అభిమానిస్తుంటారు. అసలు భారతదేశంలో most happening event క్రికెట్ ఒక్కటే. ఇక్కడ 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' అనే క్రికెట్ సంస్థ ఉంది. అది 'ఇండియన్ పొలిటికల్ లీగ్' కన్నా కూడా చాలా గొప్పది, ముఖ్యమైనది.  ఆ సంస్థ నిర్వహించే క్రికెట్ పోటీలలో బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో కొంతమందిని అరెస్ట్ చేశారు. మీడియా చానెళ్లు ఈ ఒక్క అంశం గురించే రోజుల తరబడి, రోజంతా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీనినిబట్టి  క్రికెట్ ప్రియులైన భారతీయులు ఈ పరిణామానికి తట్టుకోలేకపోతున్నారనీ, తమ అభిమాన క్రీడ భవిష్యత్తును ఊహించుకుని తీవ్ర  మనోవేదనతో కుంగిపోతున్నారనీ అర్థమవుతోంది. ప్రభుత్వం కూడా దీనిని చాలా సీరియెస్ గా తీసుకుంది. క్రికెట్ లో జరిగే మోసాలను అరికట్టడానికి కఠిన చట్టాలను తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ కుంభకోణం పై మీడియా కవరేజీ; ప్రభుత్వం, రాజకీయ పార్టీల స్పందనా  చూస్తుంటే, భారతదేశంలో ఇప్పటికీ రోజుకు ఒక డాలర్ ఆదాయం కూడా లేని పేదలు కోట్ల సంఖ్యలో ఉన్నారనీ, జనాభాలో దాదాపు యాభై శాతం మంది పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారనీ, మానభంగాలు ఎక్కువనీ, ఇతర శాంతిభద్రతల సమస్యలు కూడా ఎక్కువేననే ప్రచారం కట్టుకథలా, భారతదేశం అంటే పడని వారు చేసే దుష్ప్రచారంలా కనిపిస్తోంది. నిజానికి భారతీయులు అత్యంత క్రీడాప్రియులనీ, క్రీడారాధకులనీ, అందులోనూ క్రికెట్ వారి ఆరాధ్యదైవమనీ, అదే వారి మతమనే అభిప్రాయం కలుగుతోంది. ఇన్ని రోజులుగా మీడియాలో రాజకీయాల ఊసే లేదంటే బహుశా భారతీయులు కారల్ మార్క్స్ చెప్పిన  state wither away స్థితిని అందుకున్నారనిపిస్తుంది. వాళ్ళను చూస్తే అసూయా కలుగుతుంది."

సరే, మన విషయానికి వస్తే, ఇటీవల రాజీనామా చేసిన కేంద్రమంత్రులు అశ్వినీ కుమార్, పవన్ కుమార్ బన్సల్ లు ఒక విధంగా దురదృష్టవంతులని- ఇతరులే కాక స్వయంగా వారు కూడా ఈపాటికి అనుకుని ఉంటారు. ఎలాగంటే, IPL స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వార్త ఓ పదిహేను ఇరవై రోజుల ముందు వచ్చిందనుకోండి, అప్పుడు వారు 'spotlight' నుంచి తప్పించుకుని ఉండేవారు. రాజీనామా చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీడియా ఫోకస్  పూర్తిగా క్రికెట్ కుంభకోణం పైనే ఉండేది. అత్యంత ఆరాధ్యదైవమైన క్రికెట్టే సంక్షోభంలో పడితే మంత్రుల కుంభకోణాలు ఓ లెక్కా?!

అలాగే బహుశా రాజకీయాలలో దశాబ్దాలుగా ఉన్నవారు అసూయ చెందాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన, గురునాథ్ మెయ్యప్పన్! ఆ పేరుగల వ్యక్తి ఒకరున్నారనీ, ఆయన బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్ అల్లుడనీ మొన్నటిదాకా ఈ దేశంలో కోట్లాదిమందికి తెలియదు. మీడియా పుణ్యమా అని రెండు రోజుల్లో ఆయన పేరు దేశమంతా మారుమోగే పరిస్థితి వచ్చింది. ఆయనను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారని తాజా సమాచారం అనుకోండి. ఒకవేళ రేపు ఆయనకు వ్యతిరేకంగా పోలీసులు సాక్ష్యాలు సమకూర్చలేకపోవడంతో ఆయన నిర్దోషిగా బయటపడ్డారనే అనుకుందాం.  అప్పుడు ఆయన అశేష క్రికెట్ ప్రియుల సానుభూతిని చూరగొనే ఒక సెలెబ్రటీ అవుతారు. ఆ సెలెబ్రటి హోదాను పెట్టుబడి చేసుకుని ఆయన అనాయాసంగా పార్లమెంటు సభ్యుడూ కావచ్చు!

నిజంగానే ఈ దేశంలో క్రికెట్ ఒక మతమే ననిపిస్తోంది. మతం మత్తు మందన్న మార్క్స్ మాటల్లో నిజముందనీ అనిపిస్తోంది. క్రికెట్ దేవుడు ఆవహించిన ఈ దేశాన్ని ఏ దేవుడు రక్షించగలడు?!


Sunday, May 19, 2013

సీబీఐ అటానమీ సర్వరోగ నివారిణా?!

ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తూ ఉంటాయి. కానీ చట్టాలను ఉల్లంఘించేవారు ఎంత పటిష్టమైన చట్టాలనైనా ఉల్లంఘించే మార్గాలు వెతుకుతూనే ఉంటారు. ఒక్కోసారి ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తూనే ఉంటారు. చట్టాలను డ్రాఫ్ట్ చేసే వారే వాటిలో తప్పించుకునే మార్గాలు చొప్పిస్తూ ఉంటారన్న విమర్శ కూడా ఉంది. నిజం దేవుడికే ఎరుక.

ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు,  ఫలానా పని చేస్తే ఆ సమస్య ఇట్టే పరిష్కారమై పోతుందని ఆ సమస్యకు సంబంధించిన నిపుణులు, లేదా నిపుణులు కానివారూ కూడా  సలహా ఇస్తుంటారు. ఈ రోగానికి ఇదే మందు అని ఘంటాపథంగా చెబుతుంటారు. క్రమంగా ఆ పరిష్కారం ఒక నినాదం అయిపోతుంది. ఆ పరిష్కారాన్ని అమలులోకి తేవడమే జరిగిందనుకోండి. సమస్య మాయమైపోతుందా?! అవుతుందని చెప్పలేం. కొత్త రూపంలో అది ముందుకు రావచ్చు.

సీబీఐకి అటానమీ లేదా స్వేచ్ఛ ఇవ్వడం గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. కోల్ గేట్ వ్యవహారంతో ఆ చర్చ ఇప్పుడు కీలకమైన మలుపు తిరిగింది. సీబీఐకి స్వేచ్చ ఇచ్చే విషయమై ప్రభుత్వంతో మాట్లాడి అఫిడవిట్ దాఖలు చేయమని సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ ను ఆదేశించింది. బహుశా ఇప్పుడిక ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. సీబీఐ కి  ఏమేరకు స్వేచ్ఛ ఇవ్వాలన్న విషయంలో ప్రభుత్వం వివిధ రాజకీయపక్షాలతో మాట్లాడి ఏకాభిప్రాయానికి రావడానికి ప్రయత్నించచ్చు. ఆ ఏకాభిప్రాయం నూటికి నూరుపాళ్లూ స్వేచ్చ ఇవ్వడంపై మొగ్గు చూపుతుందో, చూపదో చెప్పలేం. సీబీఐ పూర్తిగా ప్రభుత్వంతో సంబంధంలేని సర్వస్వతంత్ర సంస్థ గా మారడానికి రాజకీయ పక్షాలు అన్నీ అంగీకరించకపోవచ్చు. ప్రభుత్వానికీ, ప్రతిపక్షాలకు మధ్య ఒకవిధమైన ప్రతిష్టంభన ఏర్పడిన ప్రస్తుత వాతావరణంలో ఈ ఏకాభిప్రాయ సాధన కూడా ఇప్పట్లో సాధ్యమవుతుందని చెప్పలేం. ప్రభుత్వమూ, రాజకీయపక్షాలూ సమస్యను సీరియెస్ గా తీసుకుని పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి ఆరంభించడమంటూ జరిగితే నేడు కాకపోతే రేపైనా అది ఒక ముగింపుకు వస్తుందన్న ఆశకు అవకాశముంటుంది.

సీబీఐ ప్రభుత్వం చెప్పుచేతల్లో పని చేస్తున్న కీలుబొమ్మ అనడంలో సందేహం లేదు. అశ్వినీ కుమార్ ఉందంతంలో ప్రభుత్వంతో సమానంగా సీబీఐ అల్లరిపాలైంది. దానికి స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛ, అవకాశం ఉండి తీరవలసిందే. అయితే ఇక్కడ ఎదురయ్యే మరో ప్రశ్న ఏమిటంటే సీబీఐకి స్వేచ్చ ఇచ్చెస్తే అదింక ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ ఆహా అనిపించే పనితీరును ప్రదర్శిస్తుందా అన్నది.

స్వేచ్చా ప్రతిపత్తి ఉన్న సంస్థలు ఎటువంటి ప్రలోభాలకూ, ఒత్తిడులకూ లొంగకుండా; నిర్భయంగా, నిష్పాక్షికంగా, నిజాయితీగా పనిచేస్తూ  అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయనుకుంటే, ఇప్పటికే ఉన్న అటానమస్ వ్యవస్థలు కూడా అలాగే పనిచేస్తూ ఉండాలి.  మరి అలా పనిచేస్తున్నాయా అన్నది పరిశీలించవలసిన ఓ ప్రశ్న.

సీబీఐకి స్వేచ్చ కల్పిస్తే, అది ప్రభుత్వం అదుపాజ్ఞలలో పనిచేయవలసిన అవసరం తప్పుతుందనుకుందాం. సీబీఐ డైరెక్టర్ పదవీ కాలాన్ని రెండేళ్ల మేరకు స్థిరపరిస్తే, ఉద్యోగానంతర లాభాలు పొందకుండా నిషేధిస్తే ప్రభుత్వం నేరుగా ఆయనకు ప్రలోభాలు చూపే అవకాశం ఉండదనుకుందాం. అయితే, ఆయన బినామీలకో, సంతానానికో ఇతరేతర పద్ధతుల్లో ప్రలోభాలు చూపే అవకాశం ఉండదా? ఇంకో సినేరియో చూడండి. యూపీలో రాజూ భయ్యాపై హత్యారోపణ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సీబీఐ ఆ కేసును డైల్యూట్ చేయడానికి ఆయన ఆర్థిక  ప్రలోభాలు ఎర వేస్తే? కనుక,  అటానమీ ఉన్నంతమాత్రాన దేశానికి సీబీఐ వల్ల  కొత్తగా  ఏదో ఒరుగుతుందని చెప్పడానికీ లేదు. చివరికి,  అంతా సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత నీతి నిజాయితీల మీద ఆధారపడి ఉంటుంది.

సీబీఐ ఇప్పటిలానే ప్రభుత్వం కింద పనిచేస్తోందనుకుందాం. అప్పుడు కూడా సీబీఐ డైరెక్టర్ వ్యక్తిగత నీతి నిజాయితీలది పై చేయి అయితే, అతడు తన విధులలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. అలా వ్యవహరించినందువల్ల పోయేవల్లా  ఉద్యోగ సంబంధమైన కొన్ని ప్రయోజనాలు, ముఖ్యంగా ఉద్యోగానంతర పదవీ లాభాలు. అంతే తప్ప ఉద్యోగం పోదు. నిజానికి అలా ముక్కుసూటిగా పనిచేసిన అధికారులు కొందరి గురించైనా మనం వింటుంటాం.

అంటే, నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న వ్యక్తి సీబీఐ డైరెక్టర్ గా ఉంటే అతడు ప్రభుత్వం కింద ఉన్నా స్వతంత్రంగా పనిచేయచ్చు. అవి లోపించినప్పుడు స్వతంత్ర వ్యవస్థలో పనిచేస్తున్నా ప్రలోభాలకు లొంగచ్చు. దీనినే తిరగేసి ఇలా కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి నీతి, నిజాయితీ, నిబద్ధత ఉనవాడైతే సీబీఐ తన అధికారపరిధిలో ఉన్నా దాని వ్యవహరణలో జోక్యం చేసుకోకపోవచ్చు. నీతి, నిజాయితీ, నిబద్ధత  లేనప్పుడు సీబీఐ తన అధికార పరిధిలో లేకపోయినా లోపాయికారీగా  ప్రలోభాలు ఎర వేసి తనకు అనుకూలంగా పనిచేయించుకోవచ్చు.

అంటే, చివరికి అంతా వచ్చి వ్యక్తిగత శీలం దగ్గరే వచ్చి ఆగుతోంది. అదీ అసలు సమస్య!




Monday, May 13, 2013

రెండు ఆశ్చర్యాలు, ఒక ఆవేదన

మళ్ళీ gap వచ్చినందుకు మన్నించాలి.
                         *

పాక్ ఎన్నికలపై భారత్ మీడియా అత్యుత్సాహం 

పాకిస్తాన్ పై భారత్ మీడియా, ముఖ్యంగా ఆంగ్ల మీడియా కనబరచే ఆసక్తి నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది. సాధారణంగా మీడియా కవరేజ్, వీక్షకులు లేదా పాఠకుల ఆసక్తి, అవసరాల ప్రమాణానికి సరిపోయేలా ఉంటుంది. ఉండాలి కూడా. కానీ భారత్ లోని వీక్షకులు, పాఠకులు పాకిస్తాన్ పై మరీ అంత  గొప్ప ఆసక్తిని కనబరుస్తూ ఉంటారని మీడియా (ఒక్క మినహాయింపు లేకుండా అన్ని మీడియా సంస్థలూ) ఎలా అంచనాకు వచ్చిందో తెలియదు. ఒక పొరుగు దేశం గా పాకిస్తాన్ పరిణామాలను భారతీయులు కొంత ఆసక్తితో గమనించే మాట నిజమే. కానీ ఆ కొంత ఎంత? భారత్ లో పరిమాణాలపై చూపించేటంత ఆసక్తిని కచ్చితంగా పాక్ పరిణామాలపై చూపించరు. కానీ మీడియా పాక్ ఎన్నికలను దాదాపు భారత్ ఎన్నికల స్థాయిలో కవర్ చేసింది. ఆదివారం నాడు ఏ చానెల్ చూసినా నవాజ్ షరీఫ్ విజయంతో అదే పనిగా ఊదరగొట్టింది. సోమవారం నాడు హిందూ 'Lion of Punjab' roars in Pak' అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది. ఎవరికి  lion? ఏ పంజాబ్ కు lion? 
పాకిస్తాన్ లో అధికార పరివర్తన భారత్-పాక్ సంబంధాలపై ప్రభావం చూపించగలదనుకోవడం దానికదే తప్పు కాదు. కానీ అనుభవం ఏం చెబుతోంది? పాక్ లో సైనిక ప్రభుత్వం ఉన్నా, ప్రజాప్రభుత్వం ఉన్నా రెండు దేశాల సంబంధాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మెరుగుపడకపోగా మరింత క్షీణిస్తూ వచ్చాయి. ఎన్నికల్లో ప్రజాపక్షం గెలిచి అధికారంలోకి వస్తే సంబంధాలు మెరుగుపడతాయని ఎప్పటికప్పుడు ఆశపడడం లోనూ తప్పులేదు. మనిషి ఆశాజీవి. అయితే ఆ ఒక్క కారణంతో పాక్ ఎన్నికలను భారత్ ఎన్నికలంతగా హడావుడి చేయక్కర్లేదు. కవర్ చేయక్కర్లేదు. అది జనానికి ఆసక్తి కలిగించక పోగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. నిజంగా ఆశావహ సంకేతాలు కనిపించేదాకా మీడియా ఆగచ్చు. భారతీయులు పాక్ పరిణామాలపట్ల పట్టలేనంత ఆసక్తితో ఉత్కంతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారనే  భ్రమ మీడియాను ఎప్పుడు ఎందుకు ఎలా ఆవరించిందో తెలియదు. ఆ భ్రమను వదిలించుకోవడం అవసరం. అందువల్ల విలువైన పత్రికా స్థలం, ప్రసార సమయం ఆదా అవుతాయి. 

యడ్యూరప్పపై బీజేపీలో అంతర్మథనం

రెండో ఆశ్చర్యం, కర్ణాటక ఓటమి నేపథ్యంలో యడ్యూరప్పపై  బీజేపీలో జరుగుతున్న అంతర్మథనం! యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం పార్టీలో ఒక వర్గానికి(మోడి, అరుణ్ జైట్లీ వగైరా) మొదట్లోనే ఇష్టంలేదనీ, అయితే మరో వర్గం( అద్వానీ వగైరా) పట్టుబట్టడంతో తప్పించారని ఎన్నికలఫలితాల రోజున మీడియాలో వ్యాఖ్యలు వినిపించాయి. అందుకు తగినట్లే, అరుణ్ జైట్లీ ఒక చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ యడ్యూరప్పను దూరం చేసుకోవడం 'reasonably high' అనీ, one "must blend governance with some prudent politics" అనీ అన్నారు. యడ్యూరప్పను వెంటనే తొలగించే బదులు మీన మేషాలు లెక్కిస్తూ ఆలస్యం చేయడం వల్లే  ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని అద్వానీ అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, యడ్యూరప్పను ఏ పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారో ఇంతలోనే పార్టీ నాయకులు మరచిపోవడం. బీజేపీ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున పోరాటం జరుపుతున్నప్పుడే యడ్యూరప్ప అవినీతీ చర్చలోకి రావడం ప్రారంభించింది. దాంతో బీజీపీ పదే పదే ఆత్మరక్షణలో పడుతూ వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా తను జరిపే జాతీయస్థాయి పోరాటం యడ్యూరప్ప వ్యవహారంతో డైల్యూట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయనను తప్పించడానికి అసలు కారణం అదీ! 

టిడిపి నుంచి కడియం శ్రీహరి నిష్క్రమణ

ఇక ఆవేదన కలిగించిన విషయం టీడీపీ నుంచి కడియం శ్రీహరి నిష్క్రమించడం. రాజకీయాలలో విలువలను, నీతినియమాలనూ ఆశించడం అత్యాశే కానీ ఒక్కొక్కసారి రాజకీయాలు మరీ ఇంత నీతి బాహ్యాలూ, అవకాశవాదపూరితాలా అనిపించి ఆవేదనా కలుగుతుంది. ఇటువంటి నీతి బాహ్య రాజకీయాలు అంతిమంగా ప్రజల్ని ఏమాత్రం ఉద్ధరిస్తాయనిపిస్తుంది. ప్రత్యేకించి కారణం లేదు కానీ, కడియం శ్రీహరి టీడీపీ నుంచి తప్పుకున్న వార్త చూడగానే ఇలాగే అనిపించింది. ముప్పై ఏళ్లుగా ఆయన టీడీపీలో ఉన్నారు. పార్టీ టిక్కెట్టుపై అసెంబ్లికి ఎన్నికవుతూ వచ్చారు. మంత్రిపదవులు నిర్వహించారు. అటువంటి వ్యక్తి పార్టీతో, అందులోనూ తనకు రాజకీయజీవితాన్ని ఇచ్చి పదవులిచ్చి ఆదరించిన పార్టీతో అన్నేళ్ళ అనుబంధాన్ని తెంచుకుని ఇంకో పార్టీలో ఎలా చేరారో తలచుకుంటే విస్మయం కలుగుతుంది. కడియం శ్రీహరే కాదు ఎవరు ఆ పని చేసినా(మరీ ప్రబలమైన వ్యక్తిగత కారణాలు ఉంటే తప్ప) ఇలాగే అనిపిస్తుంది. రాజకీయ పార్టీతో ఒక వ్యక్తి అనుబంధం మరీ ఇంత మిథ్యా? ముప్పై ఏళ్ళు కాపురం చేసిన భార్య, ముప్పై ఏళ్లపాటు రాజకీయజీవితం ఇచ్చిన పార్టీ ఒకలాంటివి కావా? ముప్పై ఏళ్ల అనుబంధాన్ని ఒక్క క్షణంలో తెంచుకోవచ్చా? ఆలోచించిన కొద్దీ రాజకీయాలు అసహ్యం కలిగిస్తున్నాయి.