Thursday, November 29, 2012

గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి?


ఊళ్ళకు టీవీలు వచ్చాయి. సెల్ ఫోన్లు వచ్చాయి. కంప్యూటర్లు వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీలూ వచ్చాయి. ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చదువులతోపాటే విదేశీయానాలూ వచ్చాయి.
ఇన్ని వచ్చినా పరిశుభ్రత ఎందుకు రావడం లేదు? తమ పరిసరాలను ఆరోగ్యకరంగా ఉల్లాసకరంగా ఉంచుకోవాలన్న స్పృహ ఎందుకు కలగడం లేదు? తమ పిల్ల పాపలు ఆరోగ్యంగా ఆనందంగా పెరిగే వాతావరణం కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్న ఆలోచన ఎందుకు రావడం లేదు?
ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు బస్ స్టాప్ కు వెళ్ళారా? అక్కడ బస్సు ఎక్కి ఎటువైపైనా ప్రయాణించి చూసారా? వీలైతే ఒకసారి ప్రయత్నించి చూడండి. అది బస్సులాగే చోటుకాదు; మురుగులో దోమలు, ఈగలు, ఇంకా నానా రకాల క్రిములు జలకమాడే చోటని వెంటనే తెలిసిపోతుంది. ఒకవైపు పచ్చగా పాచిపట్టిపోయిన  మురుగు నీటి వైతరణి కనిపిస్తుంది. ఆ వైతరణిని ఆనుకునే ఉన్న బస్ షెల్టర్ లో ఆ మురుగు నీటి మీంచి వచ్చి వాలే దోమలను, ఈగలను తోలుకుంటూ, ఆ మురికి వాసనను ఆస్వాదిస్తూ కొంతమంది ప్రయాణీకులు నిలబడి ఉంటారు. అక్కడే తినుబండారాల విక్రయమూ జరుగుతూ ఉంటుంది. ఆ మురుగు దోమలూ, ఈగలూ వాలిన ఆ తినుబండారాలను కొని జనం అక్కడే ఆరగిస్తున్న దృశ్యమూ కనిపిస్తుంది.  పోషకాహారలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ బక్క చిక్కి నీరసించిన ఆడా, మగా; పిల్లా పెద్దా చాలామంది కనిపిస్తారు.
అసలా బస్ స్టాపే వెలసిపోయి దైన్యాన్ని, దరిద్రాన్ని ఓడుతూ ఇక్ష్వాకుల కాలం నాటిదిగా తెలిసిపోతూ ఉంటుంది. ఆపైన ఎత్తు పల్లాలతో ఉన్న ఆ ప్రాంగణం, కనీసం దానిని చదును చేయించే దిక్కు కూడా లేని సంగతిని చాటి చెబుతుంది.
ఇటువంటి నికృష్ట పరిసరాలలో బస్సు కోసం ఎదురు చూడవలసిరావడానికి నిడదవోలు వాసులు, ఆ ఊరి మీదుగా వేరే ఊళ్ళకు వెళ్ళే వాళ్ళు ఏం పాపం చేశారు? ఏం నేరం చేశారు?
అన్నట్టు ఆ బస్ స్టాప్ కు దగ్గరలోనే పురపాలకసంఘ కార్యాలయం కనిపిస్తుంది. కానీ నిడదవోలు రోడ్ల మీద ప్రయాణించేవారికి అక్కడ పురపాలన కానీ, దానికో సంఘం కానీ ఉన్నాయన్న నమ్మకం చచ్చినా కలగదు.
బస్ ఎక్కి మీరు పోలవరం వైపు వెడుతున్నారనుకోండి...రోడ్డు మీద దుకాణాల ముందు, ఇళ్ల ముందు ఎక్కపడితే అక్కడ చెత్త గుట్టలు కనిపిస్తాయి. అవి చెదిరి రోడ్డు మీద ప్రవహిస్తూ  కాళ్ళకు అడ్డం పడుతుంటాయి. కొంచెం ముందుకు వెడితే ఒక చోట కొన్ని వందల గజాల ప్రదేశంలో చెత్త పరచుకుని కనిపిస్తుంది. అక్కడే బహిరంగ కాలకృత్యాలు జరుగుతుంటాయి. మరింత దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాన్ని ఎదుర్కోడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ మహా చెత్త ప్రదేశాన్ని ఆనుకునే ప్రభుత్వాసుపత్రి ఉంది!
సర్వకాలాలలోనూ రోగులతో ఆ ఆసుపత్రి కిట కిట లాడుతూ ఉంటే ఆశ్చర్యమేముంది? అయినా సరే మందులూ, డాక్టర్లూ లేని ప్రభుత్వాసుపత్రులది వేరే కథ. వేరే వ్యథ.
ఈ ఊరు చూసినా ఏముంది గర్వకారణం? ఓపెన్ డ్రైనేజీలూ, దోమలూ, ఈగలూ, ఇంకా అనేకానేక క్రిమి కీటకాలూ, బహిరంగ కాలకృత్యాలూ, రోగాలూ, రొష్టులే కదా?
 పురపాలన అనేది అడ్రస్ లేకుండా ఎటు కొట్టుకుపోయింది? జిల్లా మంత్రులూ, ఇంచార్జి మంత్రీ ఏం చేస్తున్నారు? ఎవరు అడుగుతారు? అడగాలన్న చైతన్యం ఎప్పటికి వస్తుంది?
ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రంలోని నిడదవోలు అనే ఊరు ఒక్కటే ఇలా అఘోరించిందనుకోకండి. అన్ని ఊళ్లూ ఇదే వరస. ఉదయమో, సాయంత్రమో అలా గోదావరి గట్టు మీద నడుస్తూ నది మీదనుంచి వీచే పరిశుభ్రమైన గాలిని పీల్చాలని మీరు అనుకుంటారు. తీరా అందుకు ప్రయత్నిస్తే అది ఒక జీవిత కాలపు కలగా వెంటనే అర్థమైపోతుంది. మీరు అటూ ఇటూ వ్యాపించిన బహిరంగ పాయిఖానాల మధ్య నడవవలసివస్తుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.
ఇంటికొకరైనా విదేశాల్లో ఉంటున్న నేటి అత్యాధునిక కంప్యూటర్ యుగంలో కూడా బహిరంగ కాలకృత్యాలను నిషేధించలేకపోతున్న పరమ చెత్త పాలన గురించీ పాలకుల గురించీ చెప్పుకోడానికి మాటలు దొరుకుతాయా?  ఓపెన్ లావెట్రీని తలపించే ఈ రాష్ట్రాన్ని చూసి పరాయి రాష్ట్రాల వాళ్ళూ, దేశాల వాళ్ళూ ఏమనుకుంటారు? ఈ మొహం పెట్టుకుని ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి చెప్పుకుంటారు?
సాయంకాలాలలో పదిమందీ చేరి ఉల్లాసంగా గడిపే పచ్చని పరిశుభ్రమైన పార్కులు పట్టణాలలో ఉన్నాయా, పొరపాటున ఎక్కడైనా ఉంటే, ఏ స్థితిలో ఉన్నాయి? పట్టించుకునే నాథుడు ఉన్నాడా?
ప్రభుత్వాలకూ, మునిసిపాలిటీలకూ నిధుల నిష్ట దరిద్రం ఎప్పటికీ తీరదు. ఎల్లకాలమూ వాటినే నమ్ముకుంటే పని జరగదు. జనమే పూనుకోవాలి. చందాలు వేసుకుని అయినా చెత్త నుంచి, మురికి నుంచి బయటపడే మార్గం చూసుకోవాలి. ఆరోగ్యకర పరిసరాలపై, పరిశుభ్రతపై స్పృహ పెంచుకోవాలి. మరో మార్గం లేదు.  ప్రభుత్వంతో, మునిసిపాలిటీలతోనే పని చేయించాలనుకుంటే ఆ మేరకు సంఘటితంగా డిమాండ్ చేయాలి. ఎన్నికలు అందుకు ఒక అవకాశం.
ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదే అన్నట్టుగా దానికోసం పోరాడుతున్న రాజకీయనాయకులు ఊళ్ళు తగలబడిపోతున్న సంగతిని ఎప్పటికి గుర్తిస్తారు?

ముఖ్యంగా గోదావరి స్వాదుజలాలను ఆనుకునే ఉండి కూడా మురికి ఓడుతున్న గోదావరి జిల్లాల ఊళ్ళు కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి?!  

Tuesday, November 20, 2012

ఆంధ్ర రాజకీయాలు: ఒక అబ్సర్డ్ డ్రామా


ఆంధ్రప్రదేశ్ లో అనిశ్చితి, అల్లకల్లోలం ఏర్పడి ఎంతకాలం అయింది?
దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటీ, అనేక కోణాల నుంచి ప్రాధాన్యమూ కలిగిన ఈ రాష్ట్రం అఖిలభారత జాతీయ కాంగ్రెస్ సారథుల ప్రయోగశాలగా మారి ఎంతకాలమైంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆబ్సర్డ్ డ్రామాగా మారి ఎంతకాలమైంది?
మూడేళ్లైంది...వచ్చే ఎన్నికల వరకూ ఈ రాష్ట్రం ఇలాగే ఉండబోతోంది. వెరసి మొత్తం అయిదేళ్లు. ఈ అయిదేళ్ళ కాలం రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఒక రైటాఫ్ కాలంగా నమోదు అవుతుంది. వరసగా రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారమిచ్చి, కేంద్రంలో యూపీయే అధికారానికి వరసగా రెండు పర్యాయాలు ఊతమిచ్చిన ఈ రాష్ట్రప్రజలను కాంగ్రెస్ ఇంతగా ఎందుకు శిక్షిస్తున్నదో తెలియదు. వాళ్ళ ముఖాన ఇంత అనిశ్చితిని, అయోమయాన్ని ఎందుకు లిఖించిందో తెలియదు.
కాంగ్రెస్ సారథ్యం తీసుకున్న ప్రతి ఒక్క చర్యా ప్రయోగమే అయింది.
మొదట రోశయ్యను ముఖ్యమంత్రిని చేశారు. రోశయ్యనే ఎందుకు చేయవలసివచ్చిందో తెలియదు. ఏడాదిలోనే ఆయనను తప్పించారు. కారణం తెలియదు. వృద్ధాప్యం వల్ల ఇంతటి రాష్ట్రభారాన్ని ఆయన మోయలేక పోతున్నారనో, లేదా ఆయనకు సామాజిక వర్గ బలం లేదనో అనుకుంటే ముందే ఆయనకు అవకాశమివ్వకుండా ఉండవలసింది. కానీ అఖిలభారత కాంగ్రెస్ సారథ్యం ఈ రాష్ట్రం గుండెల మీద ప్రయోగాలు చేయాలనుకుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుతో జూదమాడాలనుకుంది.
కిరణ్ కుమార్ రెడ్డిని తెచ్చారు. ఆయననుంచి ఏమి ఆశించి తెచ్చారో తెలియదు. ఈ రెండేళ్లలో అది ఎంతవరకు సఫలమైందో తెలియదు. యువకుడు కనుక ఏదో చేయాలన్న ఉత్సాహమూ, ఓపికా ఆయనకు ఉండచ్చు. కానీ ఈ అధికారం ఆయన సొంతంగా గెలుచుకున్నది కాదు. ఆయనకు జనం మాండేట్ లేదు. కనుక ఆయన గట్టిగా తనదైన ముద్రతో ఏమీ చేయలేరు. చేయాలనుకున్నా పార్టీని కబ్జా చేసిన మోతుబరులు చేయనివ్వరు. మంత్రివర్గంలో ఉంటూనే ముఖ్యమంత్రిపై కత్తి కట్టడం...ప్రభుత్వ విధానాలపై బహిరంగ విమర్శలు చేయడం...ఎవరికి వారు వ్యక్తిగత గుప్త ఎజెండాలను తయారు చేసుకోవడం...ఇదీ ఈ రాష్ట్రమంత్రివర్గంలో చూస్తున్న వింత పోకడ.
ఈ రాష్ట్రంలో ఆకు కూడా కదలని సుదీర్ఘ స్తంభన. సర్వత్రా ఒక నిశ్చల చిత్రం. తెలంగాణ సమస్య ఎక్కడి దక్కడే. సాధారణ పరిపాలన అంటారా...అధికారంలో ఎవరున్నారన్నదానితో నిమిత్తం లేకుండా అది ఏదో ఒక మోతాదులో సాగుతూనే ఉంటుంది.
ఇక రాజకీయంగా చూస్తే అంతా ఒక పెద్ద ఆబ్సర్డ్ డ్రామా. దాదాపు అన్ని ప్రధాన పక్షాలలోనూ అనేకమంది ముఖాలకు మాస్క్ తగిలించుకుని కనిపిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ సొంత ముఖాలే ఇప్పుడు మాస్క్ లుగా మారిపోయాయి. సొంత ముఖం లా కనిపించే ప్రతి మాస్క్ వెనుక మరో ముఖం ఉంది. ఎన్నికల వేడి పెరిగిన కొద్దీ ఆ మాస్క్ కొంచెం కొంచెం గా పక్కకు తొలగుతుంది. ఈ ముసుగు రాజకీయ డ్రామా క్లైమాక్స్ కు చేరుకుంటున్న సూచనలు ఇప్పటికే మొదలయ్యాయి.
మూడేళ్లుగా ఈ రాష్ట్రం ముఖానికే ముసుగు వేలాడుతోంది. ముసుగే కాదు అతి పెద్ద ముసురు పట్టిన రాష్ట్రం ఇది.
ఎన్నికల తర్వాత అయినా ఈ ముసురు తొలగుతుందా? ముసుగు జారుతుందా?
ఇదీ మిలియన్ డాలర్ ప్రశ్న!


Saturday, November 17, 2012

రెండు స్పందనలు-ఒక వివరణ


మీడియాను, బీజేపీని ఉద్దేశించి నేను రాసిన కొన్ని బ్లాగులపై శివరామప్రసాదు కప్పగంతు , గడ్కరీ సేవలో... అనే బ్లాగ్ పై శ్రీనివాస్ అనే వీక్షకుడూ స్పందించారు. ఇద్దరికీ ధన్యవాదాలు.
మీడియా వ్యవహారశైలిని శివరామప్రసాదు వేలెత్తి చూపించారు. మీడియా పని తీరులో లోపాలు ఉన్న సంగతిని నేను కూడా నా బ్లాగులలో ప్రస్తావిస్తూనే ఉన్నాను. అయితే మీడియా ఎంతసేపూ బీజేపీనే లక్ష్యం చేసుకుంటూ ఉంటుందనీ, కాంగ్రెస్ పై అభిమానం చూపిస్తూ ఉంటుందనీ, కాంగ్రెస్ కు మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలుసుననీ, బీజేపీకి అది చేతకాదనీ శివరామప్రసాదు అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవాలు ఆ అభిప్రాయాన్ని సమర్థించేలా లేవు.
మరీ వెనకటి కాలానికి వెళ్లనవసరం లేదు. గత మూడున్నర దశాబ్దాల చరిత్రనే గమనిస్తే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో మీడియా ఎంత ముఖ్య భూమిక పోషించిందో మనకు తెలుసు. అలాగే, రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ పై విపక్షాలతో గొంతు కలిపి, తదుపరి ఎన్నికల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మీడియా పాత్ర తక్కువేమీ కాదు. నిన్నటికి నిన్న, కామన్వెల్త్ క్రీడలు, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, సీవీసీ నియామకం, దయానిధి మారన్ పై ఆరోపణలు వగైరా అనేక విషయాలలో దాదాపు ఏణ్ణర్థంపాటు యూపీఏ ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోనివ్వకుండా దాడి చేసిందీ, ఇప్పటికీ చేస్తున్నదీ మీడియానే. నిజం చెప్పాలంటే ప్రతిపక్షాల కన్నా ఎక్కువగా ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నది మీడియానే. అంతేకాదు, విపక్షాల వైఫల్యం నుంచి పుట్టిన పౌరసమాజ ఉద్యమంపై ఫోకస్ చేసి ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా మీడియానే అన్న సంగతినీ గుర్తుపెట్టుకోవాలి.
మీడియాలో లెక్కలేనన్ని లోపాలూ, లొసుగులూ ఉన్నమాట నిజం. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. వాటితోపాటే ఇతరేతర వాస్తవాలనూ ఉన్నవున్నట్టు అంగీకరిద్దాం.
కాకపోతే కాంగ్రెస్, బీజేపీల విషయంలో ఒక తేడాను దృష్టిలో ఉంచుకోక తప్పదు. కాంగ్రెస్ అవినీతి గురించి అరవై ఏళ్లుగా చెప్పుకుంటున్నాం. నిజానికి ఇంకా ముందు నుంచే. కాంగ్రెస్ అధికారంలో స్థిరపడే కంటె ముందే అవినీతిలో కూరుకుపోయిందన్న విమర్శలు గాంధీ జీవించి ఉండగానే వెల్లువెత్తాయి. బ్రిటిష్ దమనకాండకు కూడా భయపడని  అంతటి గాంధీజీని సైతం భయభ్రాంతం చేసిన అవినీతి ఇది. ఆ మాట ఆయనే చెప్పుకున్నాడు. దేశమంతా స్వాతంత్ర్యోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో గాంధీ తలమునకలైంది, ఇలాంటి కాంగ్రెస్ ను ఏం చేయాలనే. అందుకు సంబంధించిన ముసాయిదాను ఆయన ఖరారు చేసింది సరిగ్గా హత్యకు గురయ్యే రోజునే. ఇదంతా చరిత్ర. ఇన్నేళ్లలోనూ అవినీతి ఆరోపణల వెలుగులో కాంగ్రెస్ తనను తాను సరిదిద్దుకోలేదు సరికదా; ఆరోపణలను తట్టుకొనే రెసిస్టెన్స్ ను సహస్రాధికంగా పెంచుకోగలిగింది.
కాంగ్రెస్ తో పోల్చితే బీజేపీ అవినీతి ఇటీవలిది.  కనుక మీడియా ఫోకస్ సహజంగానే ఎక్కువగా ఉంటుంది.  అలాగని కాంగ్రెస్ అవినీతిని మీడియా  విస్మరించిందనడానికి ఆధారం లేదు. గడ్కరీ వ్యవహారంతోపాటే వీరభద్రసింగ్ పై అవినీతి ఆరోపణలనూ సవివరంగా రిపోర్ట్ చేసింది. అంతకు ముందు రాబర్ట్ వద్రా, సల్మాన్ ఖుర్షీద్ లపై ఆరోపణలకూ ఇవ్వవలసినంత జాగా ఇచ్చింది.
బీజేపీ అవినీతిని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ అవినీతి సంగతేమిటని విద్యావంతవర్గం కూడా ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశ్చర్యం చిన్న మాట. వాస్తవానికి ఆందోళన కలిగిస్తుంది. నాటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు తీసుకుంటూ రహస్య కెమెరాకు చిక్కినప్పుడు ఆయనను వెనకేసుకువస్తూ ఆంగ్ల విద్యావంతులు అనేకమంది హిందూ లాంటి పత్రికకు సంపాదక లేఖలు రాసిన ఉదాహరణ కూడా మనముందు ఉంది. ఇలాంటి విడ్డూరపు మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ అప్పట్లో నేను రాసిన వ్యాసాన్ని త్వరలోనే పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.
ఆర్.ఎస్.ఎస్. పై నా బ్లాగ్ చవకబారుగా ఉందని ఒకరు(శ్రీనివాస్) ఆవేశపడ్డారు. తెలుగులో ఇంత చవకబారు వ్యాసం ఎప్పుడూ చదవలేదని అన్నారు. అభిమానపు రంగుటద్దాలను ఒకసారి తీసి చూడండి...చవకబారుతనం నా వ్యాసంలో ఉందో, ఆ వ్యాసానికి సందర్భమైన సంఘ్ వ్యవహరణలో ఉందో మీకే తెలుస్తుంది. గడ్కరీపై ఆరోపణలను మొదట మీడియా కుట్ర అనడం, ఆ తర్వాత మోడి కుట్ర అనడం, గురుమూర్తి క్లీన్ చిట్ ఇవ్వడం; అంతకంటే ఘోరంగా ప్రైవేట్ అవినీతికీ పబ్లిక్ అవినీతికీ మధ్య తేడా ఉందని రాజ్ నాథ్ సింగ్ ప్రభృతులు అనడం చాలా ఉదాత్తంగా ఉన్నాయనీ, నా వ్యాసం మాత్రమే చవకబారుగా ఉందనీ అంటే; ఉదాత్తం, చవకబారు అనే రెండు మాటలకూ అర్థం మార్చుకోవలసిందే.
ఇంకో విషయం. సంఘ్ కు ప్రాంతీయతత్వాన్ని, కులతత్వాన్ని నేను ఆపాదించలేదు. మరోసారి నా బ్లాగ్ జాగ్రత్తగా చూడండి. స్వపన్ దాస్ గుప్తాను నేను ఉటంకించాను. పైగా బీజేపీని, సంఘ్ పరివార్ ను గట్టిగా సమర్థించే పాత్రికేయుడుగా స్వపన్ దాస్ గుప్తా సుప్రసిద్ధుడు. 
ఇక, లోపలి మనిషి పీవీ గురించిన రచన కాదు. పీవీ యే రచించిన ది ఇన్ సైడర్ కు తెలుగు అనువాదం.

Monday, November 12, 2012

గడ్కరీ సేవలో...

వీక్షకులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
                         ***

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచిస్తుందని మనకు తెలుసు.

కానీ ఇప్పుడు సంఘ్ ఆత్మ మొత్తం ఒకే ఒక మానవుణ్ణి పట్టుకుని పాకులాడుతోంది. ఆ మానవుని పేరు నితిన్ గడ్కరీ.

 గడ్కరీపై వచ్చిన ఆరోపణల వెనుక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి పాత్ర ఉన్నట్టు ఆర్.ఎస్.ఎస్ మేధావి జి.ఎం. వైద్య తన బ్లాగ్ లో అభిప్రాయపడ్డారు.  గడ్కరీ తప్పుకోవడం మర్యాదగా ఉంటుందని రామ్ జెత్మలానీ అంటూనే, మోడీ ప్రధానమంత్రిత్వానికి అర్హుడని అన్నారు కనుక అనుమాన సూచి  మోడీని చూపిస్తోందని ఆయన భాష్యం. సహజంగానే అది బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. గుజరాత్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఘట్టంలో వైద్య మాటలు పార్టీలో అంతర్వివాదాలను రచ్చ కీడ్చి బలహీన పరుస్తాయి కనుక నాయకత్వం వెంటనే నష్టనివారణ చర్యలకు దిగింది. వైద్య అభిప్రాయంలో నిజం లేదనీ, ఎన్నికల యుద్ధఘట్టంలో పార్టీ మొత్తం మోడీకి వెన్నుదన్నుగా ఉందనీ హడావుడిగా ప్రకటించింది. గడ్కరీ కూడా వైద్య అభిప్రాయాన్ని తోసి పుచ్చుతూ ప్రకటన చేశారు.

అటు వైద్య కూడా తనది వ్యక్తిగత అభిప్రాయమే తప్ప సంఘ్ అభిప్రాయం కాదని వివరణ ఇచ్చారు.

తన ఆరోపణ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వైద్యకు తెలియదా అంటే తెలుసుననే అనుకోవాలి. పైగా ఆయన 'సీనియర్ జర్నలిస్ట్'.  వైద్యకు సంఘ్ తో గల సంబంధాలను కప్పిపుచ్చుతూ, ఆయన మాటలు ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్న మాటలుగా చిత్రించడానికి గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్ లాంటివారు ప్రయాసపడ్డారు కూడా. తక్షణమే గుర్తొచ్చే ఇలాంటి మరో ఉదాహరణ గురుమూర్తి. గడ్కరీ వ్యాపారలావాదేవీలలో ఎలాంటి అవకతవకలూ లేవని ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసినదే. సంఘ్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయన్న జగమెరిగిన సత్యాన్ని దాచి ఆయనను పేరుమోసిన చార్టర్డ్ అకౌంటెంట్ గా ఆర్థిక సలహాదారుగా పరిచయం చేయడానికి బీజేపీ నాయకులు ఇలాగే ఆయాసపడ్డారు.

తన మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలిసి కూడా వైద్య ఆ మాటలు ఎందుకన్నారు? అందులోనూ గుజరాత్ ఎన్నికలకు  సంసిద్ధమవుతున్న కీలక ఘట్టంలో పార్టీని బలహీనపరిచే వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎందుకంటే, సంఘ్ ఆత్మ గడ్కరీ అనే ఏకైక మానవుడి కోసం క్షోభిస్తోంది కనుక! గడ్కరీకి ఆపద వచ్చిందేనన్న దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్న సంఘ్ ఆ దుఃఖ పారవశ్యంలో అన్ని ఔచిత్యాలనూ గాలికొదిలేసి వీథి కెక్కింది. తమాషాగా లేదూ?

అంతేకాదు, తన మాటల ప్రభావాన్ని ముందే ఊహించగలిగిన వైద్య రాజకీయనాయకుల తరహాలో 'వ్యక్తిగత' అభిప్రాయంగా పేర్కొని తప్పించుకునే  రూటును కూడా ముందే ఆలోచించుకుని ఉండాలి. అంటే అంత పెద్ద సంఘమూ గడ్కరీ అనే మానవుడి కోసం రాజకీయ స్వయం సేవక్ సంఘ్ గా కూడా మారగలదన్న మాట. భేష్!

గతంలో సంఘ్ అధికారప్రతినిధిగా, రెండేళ్ల క్రితం వరకు సంఘ్ లో క్రియాశీల నేతగా ఉన్న వైద్యకు సంఘ్ కు భిన్నమైన 'వ్యక్తిగత' అభిప్రాయాలు...అందులోనూ బీజేపీ, సంఘ్ లతో ముడిపడిన వివాదాస్పద విషయాల్లో...ఉంటాయా? ఉండచ్చా? ఉన్నప్పటికీ వాటిని బహిర్గతపరచే స్వేచ్ఛ ఉంటుందా? ఇవీ ప్రశ్నలు.

రామ్ జెత్మలానీకి తన అభిప్రాయాన్ని ప్రకటించే హక్కు ఉన్నప్పుడు నాకు ఎందుకుండకూడదని వైద్య ప్రశ్నిస్తున్నారు. రామ్ జెత్మలానీ వివాదాస్పదంగా మాట్లాడే మనిషిగా విఖ్యాతుడు. అందులోనూ రాజకీయవాది. ఆయన మాటల్ని ఎంత మోతాదులో పట్టించుకోవాలో అంత మోతాదులోనే పట్టించుకుంటారు. అటువంటి వ్యక్తితో సంఘ్ వయో వృద్ధుడికి సాపత్యమా? హవ్వ...

ఏం మాట్లాడినా 'వ్యక్తిగతం' అన్న ట్యాగ్ తగిలిస్తే చాలు చెల్లి పోతుందనుకున్నప్పుడు కాంగ్రెస్ నేతల వ్యక్తిగత వ్యాఖ్యలను తప్పు పట్టే నైతిక అర్హత ఎలా ఉంటుంది? ఉదాహరణకు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థను బహుళ  సభ్య వ్యవస్థగా మార్చే ఆలోచన ఉందని మంత్రి నారాయణ స్వామి అన్నందుకు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఒకవేళ  'వ్యక్తిగత' స్థాయిలో ఆ మాట అన్నానని  మంత్రి  అంటే?

గమనించండి...ఎటువంటి వ్యక్తిపై ఆర్.ఎస్.ఎస్. మాతృప్రేమ కట్టలు తెంచుకుంటోదో! ఈ సంఘ్ మాజీ ప్రచారక్  క్విడ్ ప్రోకో, అడ్రస్ లేని షెల్ కంపెనీలు, అనుమానాస్పద పెట్టుబడుల వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినాసరే సంఘ్ నాయకత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. శీల నిర్మాణం గురించి ప్రబోధించే సంఘ్ నిజా నిజాలు తేలేవరకూ ఆయన తప్పుకుంటే మంచిదని అనడం లేదు. అనకపోగా గడ్కరీపై ఆరోపణలను మీడియా కుట్రగా చిత్రించడానికి సాహసించింది. గురుమూర్తి ద్వారా  గడ్కరీకి 'క్లీన్ చిట్' ఇప్పించింది. తాజాగా, గడ్కరీపై ఆరోపణల వెనుక ఏకంగా మరో మాజీ  ప్రచారక్ అయిన మోడీ కుట్ర ఉందనడానికి సిద్ధపడింది.

దీనినిబట్టి ఇంకా ఏం తేలుతోంది? బీజేపీలోనే కాక సంఘ్ లో కూడా ముఠాలు, చీలికలు ఉన్నాయని కాదా?

ఆర్.ఎస్.ఎస్., బీజేపీలను గట్టిగా సమర్థించే ప్రముఖ పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా అన్నట్టు మహారాష్ట్ర బ్రాహ్మణవర్గం గడ్కరీకి ఇలా  గొడుగుపడుతుండడమే నిజమైతే సంఘ్ చెప్పే సాంస్కృతిక జాతీయవాదం మహారాష్ట్రకూ, అందులోనూ ఒక కులానికీ;  ఏకాత్మ మానవతావాదం గడ్కరీ అనే ఏకైక మానవుడికి కాపలా కాసే స్థాయికీ కుంచించుకుపోతున్న దృశ్యమే కొట్టిచ్చినట్టు కనిపించదా?






Saturday, November 10, 2012

మీడియా వివాదోత్సాహం


ఈ మధ్య సెలెబ్రటీల మాటలు తరచు వివాదాస్పదం అవుతున్నాయి. సెలెబ్రటీలు అన్నప్పుడు అందులో రాజకీయనాయకులే కాక; సినీనటులు, దర్శకులు, రచయితలు, వ్యాపారవేత్తలు సహా అనేక వర్గాలవారు చేరతారు. బహుశా మీడియా మనుషుల్ని ఈ జాబితానుంచి మినహాయించవలసి ఉంటుంది. సెలెబ్రిటీల మాటల్ని వివాదాస్పదం చేయడంలో ముఖ్య పాత్ర వీరిదే.  రాజకీయ ప్రముఖులు సరేసరి, ఒక్కోసారి వాళ్ళ మాటలే కాదు, మౌనమూ వివాస్పదమవుతూనే ఉంటుంది. రాజకీయనాయకుల మాట (లేదా మౌనం) చుట్టూ వివాదాల మంట పెట్టి వాళ్ళను వీథిలోకి లాగడానికి ప్రత్యర్థులు అహర్నిశలూ కాచుకుని ఉంటారు. అందులో మీడియా తన వంతు పాత్రను తాను పోషిస్తూ ఉంటుంది.

నితిన్ గడ్కరీలా వేరే భాషల జోలికి పోకుండా  తమకు బాగా తెలిసిన రాజకీయభాషకు పరిమితం కావడం నాయకులకు ఉన్నంతలో సురక్షితమార్గం.  పాపం గడ్కరీ సొంత ఐక్యూను గాలికొదిలేసి వివేకానంద, దావూద్ ఇబ్రహీం ల ఐక్యూల మధ్య పోలిక తెచ్చి అల్లరి పడ్డారు. ఎవరైనా సరే, రాజకీయాలలో ఉన్న తర్వాత తమకు చాలా భాషలు వచ్చునన్న సంగతి మరచిపోవాలి. మరచిపోతేనే మర్యాద దక్కుతుంది.

మిగిలిన సెలెబ్రటీల సంగతి వేరు. వాళ్ళు రాజకీయభాషలో మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడదామన్నా ఆ భాష పట్టుబడడం అంత తేలిక కాదు. కనుక వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడతారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి!

ఉదాహరణకు, ప్రముఖ నాటక రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై లిటరరీ ఫెస్టివల్ లో మాట్లాడుతూ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత వి.ఎస్. నైపాల్ పై విమర్శలు చేశారు. ఆయన ముస్లిం వ్యతిరేకి అన్నది ఆ విమర్శల సారాంశం. వెంటనే మీడియా ఆయన మాటల్ని వివాదాస్పదం చేసేసింది. అనేక ఇంగ్లీష్ చానెళ్లు కర్నాడ్ ను తెరమీదికి లాగి మాట్లాడించాయి. పలువురు రచయితలతో చర్చ నిర్వహించాయి. అందులో ఎవరు ఏమన్నారు, కర్నాడ్ తన వాదనను ఎలా సమర్థించుకున్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. రచయితగా నటుడిగా ఎంతో చరిత్ర ఉన్న కర్నాడ్ ఒక్క రాత్రితో సాహితీ విలన్ గా మారిపోయారు. మీడియా పుణ్యం!

కర్నాడ్ విలనిజం అక్కడితో ఆగిందా, లేదు. ఆ వెంటనే ఆయన మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి రవీంద్రనాథ్ ఠాగోర్ కు గురి పెట్టి. రవీంద్రనాథ్ ఠాగోర్ గొప్ప కవే కానీ మంచి నాటక రచయిత కాడన్నారు. ఇంకేముంది...వెంటనే మీడియా రంగప్రవేశం చేసింది.  రెండే రెండు మీడియా ఫోకస్ లతో గిరీష్ కర్నాడ్ వివాదాస్పద వ్యక్తుల జాబితాలో చేరిపోయారు. ఇప్పుడిక ఆయనను నాటక రచయితగా, నటుడుగా కన్నా వివాదాస్పదుడుగానే జనం గుర్తించడం ప్రారంభిస్తారు.

నైపాల్ గురించి అయినా, ఠాగోర్ గురించి అయినా ఆయన తన అభిప్రాయం చెప్పారు.  సాహిత్యవిమర్శ రూపంలో రచనలపై, రచయితలపై అలా అభిప్రాయం చెప్పడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది.  మీడియా చానెళ్లు దానికి  వివాదాస్పద వ్యాఖ్యలు అని కొత్త పేరు పెడుతున్నాయి. పాపం కర్నాడ్ ఠాగోర్ కు కవిగా ఇవ్వవలసిన గౌరవమే ఇచ్చారు. కాకపోతే ఠాగోర్ మంచి నాటక రచయిత కాదన్నారు. మంచి కవి మంచి నాటక రచయిత కావాలనేముంది?

ఇంకా ఆయన నయం. మన శ్రీశ్రీ ఠాగోర్ ను కవిగా కూడా గుర్తించలేదు. ఠాగోర్ ను ఠ కార గురువు గా సంబోధించిన శ్రీశ్రీ, ఠాగోర్  గీతాంజలిలో కంటే బెల్లంకొండ రామరాయకవి రచించిన భక్త చింతామణిలో గొప్ప వేదాంతం ఉందన్నాడు. ఆయన మాటలు అప్పుడూ సంచలనాత్మకం, వివాదాస్పదం అయ్యాయి కానీ ఆయనపై వివాదాస్పదుడన్న ముద్ర పడలేదు. ఇప్పుడైతే కచ్చితంగా పడుండేది.

రాజ్యాంగం కల్పించిన భావప్రకటన హక్కును ఎక్కువగా అనుభవించేది మీడియానే. భావప్రకటన హక్కు ఫలితమే మీడియా కూడా. అటువంటి మీడియా మామూలు మాటల్ని కూడా వివాదాస్పదం చేసి జనాన్ని భయపెట్టేస్తోంది. రాజకీయనాయకులే కాదు, ఇతర సెలెబ్రటీలు కూడా మీడియాకు జంకి తమ భావప్రకటన హక్కును కుదించుకోవలసివస్తోంది.

ఇతరేతర శక్తులవల్ల ఇప్పటికే మన వాక్స్వాతంత్ర్యం జాగా రోజు రోజుకీ తగ్గిపోతోంది. ఉద్దేశించకపోయినా మీడియా వివాదోత్సాహం అందుకు ఎంతో కొంత దోహదం అవుతోందా?!


Thursday, November 8, 2012

వాజ్ పేయిగారూ... ఎలా ఉన్నారు?!

భారత మాజీ ప్రధాని...మాజీ ప్రతిపక్ష నాయకుడు...భవిష్యత్తులో భారత ప్రధాని కాదగినవాడుగా జవహర్లాల్ నెహ్రూ అంతటి వ్యక్తి నుంచి అలనాడే ప్రశంసలందుకున్నవ్యక్తి...మంచి పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన మనిషి..  మంచి వక్త...కవి...బీజేపీకి ఇప్పటికీ ఒకే ఒక 'లిబరల్ ఫేస్'...ఆ పార్టీ రాజకీయ 'అస్పృశ్యత'ను ఎదుర్కొంటున్న దశలో ఇరవైకి పైగా పార్టీలతో ఎన్డీయే అవతరణను సుసాధ్యం చేసీన నేత...

అటల్ బిహారీ వాజ్ పేయి ఎలా ఉన్నారు?!

చాలా రోజులుగా ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ కలిగిస్తున్న... జవాబు దొరకని  ప్రశ్న!

వాజ్ పేయి గారు ఉన్నారు! అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎలా ఉన్నారో తెలియదు. ఏం చేస్తున్నారో తెలియదు. ఏం చేయలేకపోతున్నారో తెలియదు. ఆయన గురించి ఎలాంటి సమాచారమూ పబ్లిక్ డొమైన్ లో లేదు. వాజ్ పేయి గారు ప్రజలకు కనిపించక పోవచ్చు. కనిపించే స్థితిలో లేకపోవచ్చు. అర్థం చేసుకోగలం. కానీ విచిత్రం చూడండి...ఆయన గురించి ఒక్క మాటా వినిపించడం లేదు. మీడియాలో సరే, ఆయన పార్టీ నాయకుల నోట కూడా!

అలాగని మీడియా పాత్రను తక్కువ చేయడం లేదు. నిజానికి వాజ్ పేయి గారి గురించిన  సమాచారాన్నిఅప్పుడప్పుడైనా ఈ దేశప్రజలకు అందించవలసింది ప్రధానంగా మీడియానే. అటువంటి మీడియా కూడా ఆయనపై దీర్ఘ మౌనం పాటిస్తుండడం ఆశ్చర్యకరం. ఇరవై నాలుగు గంటల వార్తా చానెళ్లు అడుగుపెట్టిన తర్వాత మీడియా సమాచారదాహం అనేక రెట్లు పెరిగిన సంగతి మనకు తెలుసు. 'సెలెబ్రటీ'లు అయితే చాలు, సమర్తలూ, సీమంతాలూ కూడా వార్తలు అవుతున్నాయనే విమర్శా వినిపిస్తోంది. నిజంగానే  చాలా అప్రధానమైన, జనానికి అక్కర్లేని సమాచారాన్ని కూడా మీడియా విరివిగా ఇస్తోంది. ఇవ్వనివ్వండి. కానీ ఆరేళ్లపాటు దేశాన్ని ఏలిన ఒక మాజీ ప్రధాని గురించిన సమాచారాన్నికొంచెమైనా ఇవ్వకపోవడ మేమిటి? వినడానికి విడ్డూరంగా లేదా?

ఆ మధ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చికిత్స కోసం అమెరికా వెళ్ళి కొన్ని మాసాలు మీడియా ఫోకస్ కు దూరంగా ఉండిపోయారు. ఆమె అనారోగ్యం ఏమిటో, ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో, దేశానికి తిరిగి ఎప్పుడు వస్తారో ఏమీ తెలియలేదు. తెలుసుకోవడంలో మీడియా వైఫల్యం అప్పుడు చర్చనీయం అయింది కూడా. సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాలలో ఉన్నారు కనుక, అందులోనూ కాంగ్రెస్ లాంటి అతి పెద్ద పార్టీకి అధినేతగా ఉన్నారు కనుక ఆమె కుటుంబసభ్యులు, పార్టీ గోప్యత పాటించడాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.

కానీ వాజ్ పేయి గారి విషయం వేరు. ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు ఊహించుకోవలసిందే తప్ప నికరమైన సమాచారం లేదు. ఆ అనారోగ్యం ఎలాంటిదో తెలియదు. ఏ దశలో ఉందో తెలియదు. ఆయన మాట్లాడుతున్నారా, మనుషుల్ని గుర్తుపడుతున్నారా...ఏమీ తెలియదు. పార్టీ నాయకులు అప్పుడప్పుడైనా ఆయనను చూసి వస్తున్నారా...బొత్తిగా తెలియదు.

బీజేపీ శ్రేణులకు ఆయనను మించిన  'ఐకాన్' ఎవరుంటారు? అయినాసరే, వారి నోట ఆయన గురించిన మాటే ఎందుకు వినిపించడంలేదు? ఏ అజ్ఞాతశక్తులైనా అప్రకటిత నిషేధాన్ని విధించారా? సహేతుకమైన కారణం కనిపించనప్పుడు ఎవరైనా సరే పరిపరి విధాలుగా అనుకుంటారు. తప్పు పట్టడానికి వీలులేదు.

ప్రతిరోజూ జనానికి అందుతున్న బండెడు మీడియా సమాచారం మధ్య... మాజీ ప్రధాని గురించి చిన్న సమాచారం...కనీసం ఇప్పుడైనా....

Tuesday, November 6, 2012

దామిని బతికింది...దయ గెలిచింది

హమ్మయ్య! దామిని బతికింది! కడుపు తీపి తెలిసిన తల్లులకు, తండ్రులకు ఇంతకంటే సంతోషాన్ని, సంతృప్తిని కలిగించే వార్త ఇంకేముంటుంది?

దామిని బతకడమే కాదు;  దయ, దానగుణం వంటి మానవీయస్పందనలపై ఆశనూ బతికించింది!

దామిని బతికిందన్న వార్త ఎంత హాయి గొలిపిందంటే, మహాభారతంలోని  ఒక ఘట్టం చటుక్కున గుర్తొచ్చింది. స్వర్గానికి వెళ్ళిన ధర్మరాజుకు అక్కడ తన సోదరులు కనిపించలేదట. పైగా దుర్యోధనుడు కనిపించాడట. ఆశ్చర్యమూ, ఆవేదనతోపాటు అసూయా కలిగిందట. నరకంలో ఉన్న సోదరులను చూడడానికి వెళ్లాడట. ఇంకేముంది, ధర్మరాజు నరకంలోకి అడుగుపెట్టగానే అక్కడ పాపాత్ములు పడుతున్న నరకయాతనలు ఆగిపోయాయి. జుగుప్సావహ దృశ్యాలు అన్నీ అదృశ్యమైపోయాయి. రకరకాల దుర్గంధాలను పోగొడుతూ శరీరానికి ఎంతో హాయి కలిగించే పరిమళవంతమైన గాలి వీచింది.

అలాగే మనం ప్రతిరోజూ మీడియా మనముందు ఆవిష్కరించే అవినీతి, అక్రమాలు, నిర్దయ, నిష్క్రియత్వం వంటి దుర్వాసనలు గుప్పించే వైతరణిలో ముక్కు మూసుకుని మునకలేస్తుంటామా...ఆ స్థితిలో చిన్నారి దామిని బతికి బట్టకట్టడం నడివేసవిలో మలయమారుతంలాంటి చల్లని వార్త.

మీడియా పనితీరుపై సవాలక్ష విమర్శలు ఉండచ్చు. కానీ కొనవూపిరితో ఉన్న దామిని దయనీయస్థితినీ, తండ్రి దుఃఖాన్నీ ప్రపంచానికి చూపించి పుణ్యం కట్టుకున్నది మీడియానే. ఆపైన దామినిని బతికించే కర్తవ్య్యాన్ని స్వచ్ఛంద సంస్థలు మీద వేసుకున్నాయి. ఒక నిరుపేద రిక్షా కార్మికుని కూతురు దామినిని బతికించడాన్ని జైపూర్ లోని ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఒక సవాలుగా తీసుకున్నారు. తమ వైద్యపరిజ్ఞానం మొత్తాన్ని రంగరించారు. అన్ని రోజులూ అక్షరాలా 'వైద్యో నారాయణో హరిః' అనిపించుకున్నారు. తమ చదువును సార్ధకం చేసుకున్నారు. అంతేకాదు, దామిని స్వస్థలమైన భరత్ పూర్ లోని ప్రభుత్వ యంత్రాంగం ఆసుపత్రి ఖర్చు భరించింది. దాతలు ముందుకొచ్చి దామినికి మంచి భవిష్యత్తును కోరుకుంటూ 17 లక్షల రూపాయలు సమకూర్చారు.

ఎంత అరుదైన సన్నివేశం! ఎంత ఆహ్లాదకరమైన దృశ్యం!

దామిని ఉదంతం ఇంకా ఏమేం చెబుతోంది? పాషాణప్రాయంగా పైకి కనిపించే ఈ వ్యవస్థలో కూడా అట్టడుగున గుండెతడి ఉందని చెబుతోంది. సరిగ్గా 'ట్యాప్' చేయగలిగితే దామిని లాంటి కోట్లాది నిరుపేద చిన్నారుల బతుకుల్లో వెలుగు నింపడానికి సిద్ధపడే  అజ్ఞాత దాతలకు, సేవకులకు ఈ దేశంలో కొదవ లేదన్న సంగతిని చెబుతోంది. ఇలాంటి వారందరినీ పూల్ చేసి ఈ దేశంలోని మరెందరో దామినులకు రక్షణ కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్ననూ ముందుకు తెస్తోంది.

ఇంకోవైపు చేదు నింపే వాస్తవాలనూ గుర్తు చేస్తోంది.

దామిని జీవించింది సరే, దామిని ఎదుర్కొన్న పరిస్థితినే ఎదుర్కొంటూ ఏ వైపునుంచీ ఎలాంటి సాయమూ అందక అజ్ఞాతంగా, అన్యాయంగా కన్ను మూస్తున్న లక్షలాది దామినులకు ఎవరు రక్ష? మీడియా ఎంతమందిని ఫోకస్ చేయగలుగుతుంది? చేయడానికి 24 గంటల వార్తా చానెళ్ల కైనా సమయం సరిపోతుందా? ఎంజీవోలైనా ఎంత చేయగలుగుతాయి? జీవో(ప్రభుత్వాసంస్థలు)లు ఏం చేస్తున్నాయి? పనంతా ఎంజీవోలకు అప్పగించి పెత్తనం చేయడానికా జీవోలు ఉన్నది?

దామినిని మృత్యుముఖం లోకి నెట్టినదీ, తల్లి లేని పిల్లను చేసిందీ కూడా పోషకాహారలోపమే. ఆ సమస్యను పరిష్కరించవలసింది ప్రభుత్వమే కానీ ప్రభుత్వేతర సంస్థలు కావు. మరి ఆ దిశగా జరుగుతున్నప్రయత్నం ఏమిటి? దామిని బతికిందన్న చల్లని వార్త వచ్చిన రోజే గుండెల్ని పిండి వేసే ఒక దారుణ వార్త. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో కరెంటు లైవ్ వైరు మీదపడి నలుగురు చిన్నారుల దుర్మరణం! అమెరికాలో ఇళ్లముందు పచ్చిక నిర్ణీత ప్రమాణానికి మించి పెరిగితే జరిమానా విధిస్తారు. ఈ దేశంలో ఇళ్ళలో నిద్రపోతున్న పసిపాపలను కరెంటు వైరుల నుంచి కాపాడే దిక్కు కూడా లేదు. అసలిక్కడ ప్రభుత్వమూ, పాలనా అనేవి ఉన్నాయా?

దామిని లాంటి పసికందుల ప్రాణాలకు అభయమిచ్చే దయగల మారాజులు ఉన్న ఈ దేశంలో పాలనా వ్యవస్థ ఇంత నిర్దయగా, నిష్పూచీగా ఎందుకు అఘోరించింది?


Monday, November 5, 2012

రాజకీయ 'వివేక' భ్రష్టత


గడ్కరీకి రోజులు బాగులేవు! ఆయన చేతలే కాదు, మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి.
జాతకాల మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన తన కంపెనీ డైరక్టర్లలో ఒకరిగా సొంత జ్యోతిష్కుని నియమించుకుంటారు? అయినాసరే ఆ జ్యోతిష్కుడు ఆయన జాతకం సరిగా చెప్పినట్టు లేదు. ఎక్కడో లెక్క తప్పింది. వివాదాల ఊబిలో ఇంకా ఇంకా కూరుకుపోతూనే ఉన్నారు. ఆయన రాజకీయభవిష్యత్తుకు రాహువు అడ్డుపడుతున్న సూచనలే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆర్.ఎస్.ఎస్. చక్రం అడ్డేసినా ప్రయోజనం ఉంటుందని తోచడంలేదు.
ఒకే రోజున రెండు ఎదురు దెబ్బలు!
పాపం ఆయన ఏదో సమావేశంలో మాట్లాడుతూ వివేకానందుడికీ, పేరుమోసిన స్మగ్లర్ దావూద్ ఇబ్రహీమ్ కీ పోలిక తెచ్చారు. ఎంత అపచారం అంటూ కాంగ్రెస్ శ్రేణులు వెంటనే బరిలోకి దిగాయి. రాజకీయంగా అంది వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వదలుకుంటారు? ఒకవేళ కాంగ్రెస్ నేత ఎవరైనా అలా మాట్లాడినా బీజేపీ అదే చేస్తుంది. అంతకంటే ఎక్కువే చేస్తుంది. వివేకానందుడు కాంగ్రెస్ కి కన్నా తమకే దగ్గరని బీజేపీ అనుకుంటుంది.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అలా పోలిక తేవడంలో గడ్కరీకి ఎలాంటి దురుద్దేశమూ ఉండి ఉండదు. ఆయన పూర్వాశ్రమంలో ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ గా ఉన్నారు. బహుశా ఆ క్షణంలో తను బీజేపీ జాతీయ అధ్యక్షుడినన్న సంగతిని మరచిపోయి, కాసేపు ప్రచారక్ పాత్రలోకి మారిపోయి ఉంటారు. ఆర్.ఎస్.ఎస్. బైఠక్ ల లో అలాంటి ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ బైఠక్ లలో కాంగ్రెస్ వాదులు ఉండరు. ఆ ప్రసంగాలు మీడియాలో రిపోర్ట్ కావు. కనుక పేచీ ఉండదు.
ప్రచారక్ భాష ఒక్కటేనా, గడ్కరీ ఆ సమయంలో సైన్సు భాష కూడా మాట్లాడారు. సైన్సు టీచర్ గా మారిపోయారు. సైంటిఫిక్ భాషలో చెబితే వివేకానందుడు, దావూద్ ఇబ్రహీమ్ ల ఐక్యూ ఒకటే. కానీ వివేకానందుడు తన ఐక్యూను సామాజిక శ్రేయస్సుకు ఉపయోగిస్తే, దావూద్ సామాజిక వినాశనానికి ఉపయోగించాడని ఆయన మాటల సారాంశం.
ఆ మాటల్లో తప్పేముందని మామూలు బుర్రలకు అనిపిస్తుంది. ఉదాహరణకు, రాముడు ధర్మాత్ముడు, రావణుడు అధర్మపరుడు అన్నామనుకోండి... అది రావణుడితో రాముణ్ణి పోల్చి అవమానించినట్టు అవుతుందా?! అయితే ఇది మామూలు బుర్రలకు కలిగే సందేహం. రాజకీయ బుర్రలు వేరు.  మీరు ఏం మాట్లాడండి, రాజకీయ బుర్రలు తమకు కావలసిన అర్థాన్నే తీసుకుంటాయి.
ఎంతో కాలంగా రాజకీయాలలో ఉన్నా గడ్కరీ ఆ సంగతి ఆ క్షణంలో మరచిపోయారు. హఠాత్తుగా ప్రచారక్ భాషలోనూ, సైన్సు భాషలోనూ మాట్లాడారు. దాంతో వచ్చింది చిక్కు. ఎందుకలా మాట్లాడారంటే, ప్రస్తుతం ఆయన గ్రహస్థితి బాగులేదుకనుకనే కావచ్చు.
గడ్కరీ మాటలపై శత్రుపక్షంలోనే కాదు, సొంత పార్టీలోనే నిరసన రాజుకుంది. మహేష్ జెత్మలానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గడ్కరీకి ఇది రెండో ఎదురుదెబ్బ.
మామూలు మనుషులతో పోల్చితే రాజకీయనాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారనుకుంటాం. కానీ ఏది పడితే అది మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు లేదు. ఆ ప్రాథమికసత్యాన్ని విస్మరించడమే గడ్కరీ చేసిన తప్పు. రాజకీయనాయకుడు  మాట జారితే చెల్లించుకోవలసిన మూల్యం ఒక్కొక్కసారి భారీగానే ఉంటుంది. అద్వానీయే అందుకు ఉదాహరణ. జిన్నాను లౌకికవాదిగా కీర్తించి ఆయన ఆర్.ఎస్.ఎస్. ఆదరణను, బీజేపీ అధ్యక్షపదవినీ కోల్పోయిన సంగతి తెలిసినదే.
రాజకీయవివేకం కోల్పోయి మాట్లాడినందుకు గడ్కరీ ఎటువంటి ప్రతిఫలం చెల్లించుకుంటారో వేచి చూడవలసిందే.

Saturday, November 3, 2012

ఉరిమి ఉరిమి మీడియా మీద...


అత్త కొట్టిందని కాదు, తోడికోడలు నవ్విందని ఏడ్చిందట వెనకటికి ఒకామె.  అరవింద్ కేజ్రీవాల్ దాడితో గుక్క తిప్పుకోలేకపోతున్న కాంగ్రెస్, బీజేపీలు మీడియా ఇలాంటివారికి విపరీత ప్రచారం కల్పిస్తోందని తప్పు పడుతున్నాయి. అసలు కేజ్రీవాల్ అనే మనిషి మీడియా సృష్టి తప్ప మరొకటి కాదంటున్నాయి. మీడియాపై అక్కసు, అసహనం ఎంత దూరం వెళ్ళిందంటే; రాజకీయనాయకులు ఇప్పుడు మీడియాకు సరికొత్త హితబోధ కూడా ప్రారంభించారు. ఎంతసేపూ నెగిటివ్ ప్రచారమేనా, అజ్ఞాతంగా ఎంతోమంది ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తున్నారు, వాటిని వెలుగులోకి తీసుకురండని సలహా ఇస్తున్నారు.
బీజేపీ అధికారప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఒక టీవీ చానెల్ చర్చలో పాల్గొంటూ అలాంటి అజ్ఞాత సంఘసేవకుల పేర్లు కొన్ని ఉదహరించారు కూడా. టీవీ చానెళ్లలో తరచు కనిపించే రవిశంకర్ తను జేపీ ఉద్యమం నుంచి వచ్చినవాడినని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. మంచిదే కానీ, అవినీతికి వ్యతిరేకంగా జేపీ లాంటి మహనీయుడి నాయకత్వంలో సాగిన  అంత గొప్ప రాజకీయేతర ఉద్యమంనుంచి వచ్చిన తను ఆ ఉద్యమానికి జేపీతోనే అంత్యక్రియలు ఎందుకు జరిపారో తెలియదు. రాజకీయాలలోకి ఎందుకు వచ్చారో తెలియదు. అందులోనూ పార్టీపై, పార్టీ నాయకులపై సమర్థించుకోలేని ఆరోపణలు వచ్చినా సరే, బాహాటంగా సమర్థించుకుంటూ టీవీ తెరపై తరచు లాఫింగ్ స్టాక్ గా మారే అధికారప్రతినిధి పాత్రను ఎందుకు నిర్వహిస్తున్నారో అంతకంటె తెలియదు.
 జేపీ ఉద్యమంలో పనిచేయడం ద్వారా తెచ్చుకున్న గుర్తింపును రాజకీయాలలో పెట్టుబడి పెట్టి పదవులూ, పరకా సంపాదించి పైకొచ్చి అవినీతి అక్రమాల ఆరోపణలలో  కాంగ్రెస్ నాయకుల రికార్డ్ ను తిరగరాసిన వారు చాలామంది ఉన్నారు. వెంటనే స్ఫురించే ఒక ప్రసిద్ధమైన పేరు లాలూ ప్రసాద్ యాదవ్. వీరంతా జేపీ ఉద్యమ మూలాలనుంచి బయటపడి కూడా మూడు దశాబ్దాలకు పైగా అయింది. ఇన్నేళ్లలో మరోసారి జేపీ తరహా ఉద్యమం(ఇక్కడ ఉద్యమంతోనే కానీ ఉద్యమసారథులతో పోలిక తేవడం లేదు)ప్రారంభమయ్యేసరికి వీరికి కూడా ముచ్చెమటలు పోస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా తమ ఉద్యమగతాన్ని మాటి మాటికీ గుర్తుచేసి, మేమూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవారమేనని నమ్మించవలసి వస్తోంది. ఇంకా తమాషా ఏమిటంటే, కేజ్రీవాల్ తరహా ఊహించని ఉత్పాతంతో బుర్ర చెడి దీనంతటికీ పాపాలభైరువుడు మీడియాయే నంటూ చివరికి వార్తాహరుడిపై కారాలు మిరియాలు నూరవలసివస్తోంది. మరింత విచిత్రంగా, ఎప్పుడూ నెగిటివ్ ప్రచారమేనా అంటూ సరికొత్త నీతి సూత్రాలు కంఠతా పట్టవలసివస్తోంది.
అన్నా హజారే, కేజ్రీవాల్ తదితరులు మీడియా జాగాను తగుమేరకు ఆక్రమించుకుని ఉండకపోతే మీడియా దృశ్యం ఎలా ఉండేదో ఊహించడం కష్టం కాదు. ఎప్పటిలా రాజకీయపక్షాలే మీడియా జాగాను కబ్జా చేసి ఉండేవి. వాటిలోనూ కాంగ్రెస్, బీజేపీలకు సింహభాగం లభించి ఉండేది. వీధి కుళాయి స్థాయి రాజకీయ ఆరోపణలను, కొట్లాటలను కూడా మీడియా యథావిధిగా రిపోర్ట్ చేస్తూ ఉండేది. రవిశంకర్ ప్రసాద్ లాంటి వారు తమ గత ఉద్యమస్మృతులను గుర్తు చేసుకోవలసిన అవసరం తలెత్తేది కాదు. ముఖ్యంగా, నెగిటివ్ ప్రచారంలో కాకలు తీరినవారు కూడా నెగిటివ్ ప్రచారాన్ని తప్పు పట్టి మీడియాపై మేకులు చెక్కవలసిన అవసరమూ ఉండేది కాదు. తనవరకూ వస్తే తప్ప తత్వం బోధపడదని ఊరికే అనలేదు.
అన్నా, కేజ్రీవాల్ ఉద్యమం కాంగ్రెస్ కు గురి పెట్టినన్ని రోజులూ ఆనందాన్ని జుర్రుకోడానికి బీజేపీకి రెండు కళ్ళూ చాలలేదు. ఉద్యమాన్ని సమర్థిస్తూ చివరికి ఉద్యమ వేదికపై ప్రత్యక్షం కావడానికీ వెనుకాడలేదు. అప్పుడు మితిమీరిన ప్రచారం ఇస్తున్నారంటూ మీడియాపై మండిపడడం కాంగ్రెస్ వంతయింది. ఉద్యమం గురి బీజేపీ వైపు తిరిగేసరికి సీను మారిపోయింది. మీడియాపై కాంగ్రెస్ అక్కసునే బీజేపీ అందిపుచ్చుకోవలసివచ్చింది. అటు ఉద్యమమూ ఇటు మీడియా కూడా ఉభయపక్షాలకూ ఉమ్మడిశత్రువుగా పరిణమించాయి. అలాగని శత్రువుకి శత్రువు మిత్రుడన్న నీతిని  పాటించి అవి చేతులు కలపలేని పరిస్థితి.
అన్నా, కేజ్రీవాల్ తరహా ఉద్యమం ఎంతవరకూ లోపరహితం అన్నది వేరే విషయం. అయితే, కేంద్రంలో అధికారపక్షంగా కాంగ్రెస్, ప్రధానప్రతిపక్షంగా బీజేపీల లొసుగులు, వైఫల్యాలే మరో జేపీ తరహా(ఇక్కడ కూడా ఉద్యమంతోనే పోలిక అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి)ఉద్యమాన్ని ముందుకు తెచ్చాయనీ, క్రమంగా రాజకీయ పక్షాలను పక్కకు నెట్టి కేంద్రస్థానాన్ని ఆక్రమించుకున్నాయనీ మరచిపోకూడదు. అలాగే, మీడియా అద్దంపై మచ్చలు లేవని ఎవరూ అనరు. అయినాసరే అది అద్దమే. బయట ఏది ఫోకస్ లో ఉందో అదే అందులోనూ ప్రతిబింబిస్తుంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా కనీసం ప్రస్తుతాంశానికి సంబంధించినంతవరకు, ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది పూర్తిగా మీడియా ప్రాథమిక ఇంగితానికి సంబంధించిన విషయం.  
పోలిటికల్లీ కరెక్ట్ కాదని తెలిసి కూడా రాజకీయపక్షాలు మీడియాపై ఎందుకు కత్తులు నూరుతున్నాయి? మీడియా ప్రాథమిక ఇంగితంలోనే జోక్యం చేసుకుని ఎందుకు ప్రశ్నిస్తున్నాయి? ఎందుకంటే, ఉమ్మడి శత్రువును ఎదుర్కొనే ఉపాయాలు తోచకనే. అందుకే అవి మరింతగా విదూషకపాత్రలోకి జారిపోయి విషాదపు నవ్వులు నిర్విరామంగా పూయిస్తున్నాయి. మరింతగా అల్లరి పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయపక్షాలు ఇప్పుడున్న దుస్థితి పగవాడికి కూడా వద్దు!